తూర్పులో జ‌న‌సేన దూకుడు.. ఆపేదెవ్వ‌రు!

October 8, 2018 at 6:07 pm

తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన ప్ర‌భంజనం పెరుగుతోందా? అంచ‌నాల‌కు మించి జ‌నాద‌ర‌ణ సంపాదిస్తోందా? అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భావం అంత‌గా ఉండ‌ద‌ని విమ‌ర్శించిన వాళ్లే ఇప్పుడు అవాక్క‌య్యేలా ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయా? ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టిన ప‌వ‌న్‌.. ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు అందుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇంతింతై వ‌టుండింతై అన్న చందంగా జ‌న‌సేన క్ర‌మ‌క్రమంగా రూపాంతరం చెందుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో పార్టీకి అశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుండటం.. ఇత‌ర పార్టీ నేత‌ల‌కు కంటి మీద కునుకు దూరం చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీలో చేరిక‌లు జోరందుకుంటున్నాయి. ఇప్ప‌టికే సీనియ‌ర్ నాయ‌కులు కొంద‌రు పార్టీలో చేరిపోగా.. ఇప్పుడు మ‌రికొంద‌రు ఇదే జాబితాలో ఉన్నారు. మొద‌ట్లో జ‌న‌సేన‌ను లైట్ తీసుకున్న ఇత‌ర పార్టీల నాయ‌కులు.. ఇప్పుడు చేరిక‌లు చూసి బిత్త‌ర‌పోతున్నారు. చాప కింద నీరులా.. జిల్లాలో జ‌న‌సేన బ‌లం పుంజుకుంటోంది. ప‌వ‌న్‌కు ఉన్న జ‌నాద‌ర‌ణ‌తో పాటు.. సామాజిక‌వ‌ర్గ నేత‌లు కూడా అండ‌గా నిలుస్తుండ‌టంతో నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా జ‌న‌సేన ఎదుగుతోందనే చ‌ర్చ మొద‌లైంది.

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న‌ది నానుడి! స‌రిగ్గా దీనిని నిజం చేస్తున్నాడు జ‌న‌సేనాని. త‌న‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉన్న‌.. త‌న సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న‌.. ప్రాంతంలో బ‌ల‌ప‌డి త‌ర్వాత ఇత‌ర జిల్లాల‌కు వెళ్ల‌లని నిర్ణ‌యించి ముంద‌డుగు వేశాడు. ఇది స‌త్ఫ‌లితాలిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. ముందుగా ఉభ‌య గోదావ‌రి జిల్లాలపై ఫోక‌స్ పెట్టాడు ప‌వ‌న్‌! ఈ రెండు జిల్లాల్లో వీలైన‌న్ని ఎక్కువ సీట్లు సంపాదించాల‌నే టార్గెట్‌తో ముందుకు దూసుకెళుతున్నాడు. రాజ‌కీయ కార్యాచర‌ణ అంతా ఇక్క‌డి నుంచే ప్రారంభిస్తున్నాడు. ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాడు. ఫ‌లితంగా జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతోపాటు త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా 19 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న తూర్పుగోదావ‌రిలో.. త‌న సామాజిక‌వ‌ర్గానికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌వ‌న్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసిన నేత‌లు.. ఇప్పుడు జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముత్తా గోపాలకృష్ణ, ఆయ‌న త‌న‌యుడు వైసీపీకి గుడ్‌బై చెప్పి జ‌న‌సేన‌లో చేరిపోయిన విష‌యం తెలిసిందే!

ఇదే బాట‌లో మ‌రికొంద‌రు కూడా న‌డుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాద్, పాముల రాజేశ్వరీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇరువురికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరేవారిని ప్రజల్ని కలుపునే శక్తి ఉందా? లేదా అనేది మాత్రమే చూస్తానని.. ఆర్థిక బలాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి తాను తీసుకోవడానికి కాదు.. ఇవ్వడానికే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో చేరిన రాపాక ప్రసాద్‌కు పవన్‌ కల్యాణ్ టికెట్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజేశ్వరి 2017లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరారు. ఈ రెండు జిల్లాల‌పై ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఒక్క సీటు కూడా రాని ప‌శ్చిమ గోదావ‌రి కంటే.. అంతోఇంతో బ‌ల‌మున్న తూర్పులో ఈసారి ఎలాగైనా ఎక్కువ సీట్లు ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో జ‌గ‌న్‌ ఉన్నారు.

తూర్పులో జ‌న‌సేన దూకుడు.. ఆపేదెవ్వ‌రు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share