ఈ సారైనా జేపీ స‌క్సెస్ అయ్యేనా?

మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌స‌త్తా పార్టీ మాజీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఉర‌ఫ్ జేపీ మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నార‌ట‌. 2009లో హైద‌రాబాద్‌లోని కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయ‌న త‌ర్వాత కాలంలో పార్టీని ప‌టిష్టం చేసుకోలేక‌పోయారు. లాజిక్ తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకున్నారు. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ త‌న పాత స్వ‌రూపాన్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. వ్యవస్థను మార్చేందుకు, పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 13, తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి ‘యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’, ‘సిటిజన్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’ నినాదంతో ముందుకు సాగనున్నట్లు జేపీ వివ‌రించారు. ‘జనం కోసం జేపీ సురాజ్య యాత్ర’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, రెండు వెబ్‌సైట్లను ఆయ‌న ఆవిష్కరించారు. సురాజ్య యాత్రలో ముఖ్యంగా ఆరు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ యాత్రలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనా యాత్ర లక్ష్యం జాతీయస్థాయిదని పేర్కొన్నారు.

ఈ యాత్ర‌లో యువతను భాగస్వామ్యం చేసేందుకు www.youthforbetterindia.com ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించినట్లు చెప్పారు. యాత్ర ఖర్చుతో కూడుకున్నది కావున ప్రోత్సహించేందుకు దాతలు తమవంతు విరాళాలు అందించాలని, వారు అందించే ప్రతీ పైసాకు పది పైసల పని చేసి చూపిస్తామని తెలిపారు. దాతలు www.fdrindia.orgలో సంప్రదించాలని సూచించారు. మొత్తానికి జేపీ మ‌ళ్లీ యాక్టివ్ అవుతుండ‌డంపై సామాజిక ఉద్య‌మ నేత‌ల్లో హ‌ర్షం వ్య‌క్తమైంది. మ‌రి దీని ద్వారానైనా ఆయ‌న మ‌ళ్లీ పుంజుకుంటార‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేశారు.