జ‌య వార‌సుడి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!

February 10, 2017 at 12:13 pm
Ajith

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత‌ వార‌సులు ఎవ‌రు? జయ నెచ్చెలి శ‌శిక‌ళ‌నా లేక జ‌య న‌మ్మిన‌బంటు పన్నీర్ సెల్వమా? అనే విష‌యంపై ఇప్ప‌టికీ స‌స్పెస్ కొన‌సాగుతోంది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె వార‌సుడిగా త‌మిళ‌ సినీన‌టుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ త‌ర్వాత ఆ పేరు వినిపించ‌నేలేదు! అయితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాట రాజ‌కీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెద‌ప‌డం లేదు? అస‌లు అజిత్ ఏమ‌య్యాడు ? సినీ తార‌లు ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నా.. అజిత్ ఎందుకు స్పందించ‌డం లేదు, అజిత్ మాయ‌మ‌య్యాడా? అనే గుస‌గుస‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

జయలలిత మృతి తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు ఆమె రాజకీయ వారసత్వం కోసం శశికళ, పన్నీర్‌ సెల్వం హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు సైతం మీడియా ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పారు.కానీ జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా మీడియాలో ప్రచారమైన ప్రముఖ హీరో అజిత్‌ కుమార్‌ మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్‌.. ఇప్పుడెందుకు మౌనాన్ని ఆశ్రయించారనే వాదన వినిపిస్తోంది.

ద్రావిడ రాజకీయాలంటే అన్నాడీఎంకే-డీఎంకే మధ్య బద్ధవైరమే గుర్తొస్తుంది. ఈ క్రమంలో అజిత్‌ ఓ అవార్డుల వేడుకలో నేరుగా డీఎంకే అధినేత క‌రుణానిధిని టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. సినిమాల్లో రాజకీయాలు తీసుకురావద్దంటూ ఆయన ప్ర‌సంగం చేశారు. అలాగే జయలలిత స్ఫూర్తితోనే అజిత్‌ మళ్లీ జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాడట. 2015లో `వేదాళం` సినిమా విడుదల సందర్భంగా అమ్మను అజిత్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జయలలిత వాకబు చేశారట. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టార‌ట అజిత్‌!!

గత ఏడాది సెప్టెంబర్‌లో జయలలిత ఆస్పత్రిలో చేరిన సంద‌ర్భంలోనూ ఆమెను మొదట పరామర్శించింది అజితే. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయ మరణం తర్వాత అజిత్‌ తెరముందుకు రాకుండా శశికళ అడ్డుకున్నదన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా అజిత్ ముందుకొచ్చి.. త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెడతారో లేదో!!

 

జ‌య వార‌సుడి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share