తెర‌పైకి జ‌య – శోభ‌న్‌బాబు కూతురు… మోడీ, కోవింద్‌కు లేఖ‌లు

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్కడ రాజకీయం ఎలా సంక్షోభంలో ప‌డిపోయిందో చూస్తూనే ఉన్నాం. అక్క‌డ అధికారం కోసం ప‌న్నీరుసెల్వం, ప‌ళ‌నిస్వామి, శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్ ర‌క‌ర‌కాలుగా ఎత్తులు వేసుకుంటున్నారు. మ‌ధ్య‌లో పిల్లి-రొట్టె క‌థ‌లో పిల్లిలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కాచుకు కూర్చొంది. వీళ్ల గొడవ ఇలా ఉండ‌గానే ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు సైతం తాను సిద్ధమని ప్రకటించింది.

జ‌య‌ల‌లిత మృతిపై త‌న‌కు చాలా అనుమానాలు ఉన్నాయ‌ని చెప్పిన ఆమె దీనిపై సీబీఐ ద‌ర్యాప్తు కూడా చేయించాల‌ని ఆమె కోరింది. ప్ర‌ధాని మోడీతో పాటు రాష్ట్ర‌తి రామ్‌నాథ్ కోవింద్‌ల‌కు ఆమె రాసిన లేఖ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. వాస్త‌వానికి గ‌తంలోనే శోభ‌న్‌బాబు – జ‌య‌ల‌లిత‌కు మ‌ధ్య ఉన్న సంబంధానికి గుర్తుగా జ‌య ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి ఎవ‌ర‌నేది ఇప్ప‌ట‌కీ ఎవ‌రికి స‌రైన క్లారిటీ లేదు. దీనిపై గ‌తంలోనే ఒక‌రిద్ద‌రు మ‌హిళ‌లు మీడియా ముందుకు వ‌చ్చి తామే జ‌య కుమార్తెలం అంటూ నానా హంగామా చేశారు.

ఇక తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన అమృత చెపుతోన్న దాని ప్ర‌కారం జ‌య అమ్మానాన్న‌ల‌ను కోల్పోయి మాన‌సికంగా కుంగిపోయిన ద‌శ‌లో శోభ‌న్‌బాబుకు ద‌గ్గ‌రై ఆయ‌న సాహ‌చ‌ర్యాన్ని కోరుకున్నారు. ఆ టైంలో వారిద్ద‌రి ప్రేమ‌కు గుర్తుగా తాను జ‌న్మించిన‌ట్టు ఆమె చెపుతున్నారు. ఆ త‌ర్వాత జ‌య త‌న‌ను ఆమె సోద‌రి శైల‌జ‌తో పాటు ఆమె భ‌ర్త సార‌థికి అప్ప‌గించార‌ట‌. తాను జ‌య కుమార్తెన‌న్న విష‌యం ఎవ్వ‌రికి చెప్ప‌వ‌ద్ద‌ని కూడా ఆమె త‌న సోద‌రితో పాటు ఆమె భ‌ర్త నుంచి ఒట్టు వేయించుకున్న‌ట్టు అమృత చెపుతున్నారు.

ఇక తాను 1996లో శైల‌జ‌, సార‌థి సూచ‌న మేర‌కు జ‌య‌ను క‌ల‌వ‌గా ఆమె విష‌యం తెలుసుకుని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా తాను అనేక‌సార్లు జ‌య‌ను క‌లిసినా ఆమె మాత్రం తానే త‌న త‌ల్లిని అన్న విష‌యాన్ని ఎప్పుడూ చెప్పలేద‌ని కూడా అమృత చెపుతున్నారు. ఇక జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె మేన‌ల్లుడు, మేన‌కోడ‌లు అయిన దీప‌, దీప‌క్ ఆమె ఆస్తుల‌కు తానే వార‌సులం అని ప్ర‌క‌టించుకోవ‌డంతో అమెరికాలో ఉన్న త‌మ బంధువు జ‌య‌లక్ష్మి ఫోన్ చేసి త‌న‌కు ఈ విష‌యం చెప్పిన‌ట్టు ఆమె చెప్పారు.

బెంగ‌ళూరులో ఉన్న త‌మ బంధువులు సైతం త‌న‌కు ఇదే విష‌యాన్ని చెప్పార‌ని..ఇక త‌న తల్లి జ‌య‌ల‌లిత‌ను కొంత‌మంది కుట్ర చేసి చంపేశార‌ని..వీరిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు అని ఆమె ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తికి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఏదేమైనా త‌మిళ‌నాట రాజకీయ సంక్షోభం ముదురుతోన్న టైంలో అమృత లేఖ‌లు ఇప్పుడు పెద్ద క‌ల‌కలం రేపుతున్నాయి.

jayalalitha