జేసీ రాజీనామా అస్త్రంతో టీడీపీలో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

March 18, 2019 at 12:11 pm

అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. పార్టీ చ‌రిత్ర‌లోనే గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేనంత అయోమ‌య స్థితి నెల‌కొంది. నేటి నుంచి నామినేష‌న్ల ప్రక్రియ మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే సీట్ల పంప‌క‌మే ఇంకా పూర్తి కాక‌పోవ‌డంపై తీవ్ర సందిగ్ధం ఏర్ప‌డింది. సిట్టింగుల్లో ప‌లువురి మార్చాల‌ని గ‌తంలోనే జేసీ దివాక‌ర్‌రెడ్డి కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు అధినేత‌కే చెప్పారు. ఆ క్ష‌ణం వ‌ర‌కు జేసీ మాట‌లు కాద‌న‌లేక‌నో, లేక త‌ర్వాత చూద్దాంలే అనుకునో ఏమో గానీ చంద్ర‌బాబు అప్ప‌డు ఇచ్చిన మాట ఇప్పుడు పూర్తిగా విస్మ‌రించారు. ఆయా స్థానాలు వారివారికే కేటాయించారు.

అస‌లు క‌థ ఇప్పుడే మొద‌లైంది.. ఆయా స్థానాల్లో సిట్టింగుల‌కే కేటాయించ‌డంపై సొంత పార్టీతో పాటు స్థానికంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. బెదిరింపులు, ఆందోళ‌న‌ల‌తో ఎన్నిక‌ల వేళ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింది. ఈ క్ర‌మంలోనే జేసీ నిక్క‌చ్చిగా నలుగురికి స్థాన‌చ‌ల‌నం చేయాల‌ని భీష్మించారు. ఒక‌వేళ అలా చేయ‌క‌పోతే అవ‌స‌ర‌మైతే త‌మ‌కు కేటాయించిన స్థానాన్ని సైతం వ‌దులుకోవ‌డానికి వెన‌కాడేది లేద‌ని క‌రాకండిగా ప్ర‌క‌టించారు. దీంతో సీట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీలో తీవ్రాతి తీవ్ర‌మైన అనిశ్చితి నెల‌కొంది.

కాగా, అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో అధిక సంఖ్య‌లో ఉన్న మైనార్టీలు, బ‌లిజ‌లు సైతం ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించుకుని చౌద‌రికి టిక్కెట్టు ఇవ్వొద్ద‌ని, ఇస్తే తామంతా రాజీనామా చేసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు సైతం పంపించారు. అదీ కాకుండా క‌దిరి, క‌ల్యాణ‌దుర్గం, సింగ‌న‌మ‌ల‌, గుంత‌క‌ల్లులో ఆశావ‌హుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఒక‌రికి సీటిస్తే మ‌రొక‌ర‌కు స‌హ‌క‌రించ‌డానికి స‌సేమిరా అంటున్నారు. ఈ జిల్లాలో ఉన్న ఇద్ద‌రు మంత్రులు కూడా త‌మ‌త‌మ స్థానాల‌ను ద‌క్కించుకోవ‌డానికే అప‌సోపాలు ప‌డుతున్నారు. ఇన్ని గంద‌ర‌గోళాల నడుమ అటు జేసీ వ్యాఖ్య‌లు, ఇటు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్ల త‌గువుతో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

జేసీ రాజీనామా అస్త్రంతో టీడీపీలో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share