తూర్పులో టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌…. జ్యోతుల గుడ్ బై

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌క జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ త‌గిలింది. ఓ ప‌క్క కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దెబ్బ‌తో చంద్ర‌బాబు విల‌విల్లాడుతుంటే మ‌రోవైపు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టి పోటీ ఇస్తుండ‌డం మ‌రో త‌ల‌నొప్పిగా మారింది. ఇక తాజాగా అదే జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ త‌గిలింది.

జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్‌ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఆయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. 

గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసి నెహ్రూ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నెహ్రూ టీడీపీని వీడి వెళ్లిపోయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని ర‌క్షిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో టీడీపీలోకి జ్యోతుల నెహ్రు రావ‌డంతో చంటిబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

ఇటు నెహ్రూ నియోజ‌క‌ర్గంలో పెత్త‌నం చెలాయిస్తుంటే ఇటీవ‌లే జ‌డ్పీ చైర్మ‌న్‌గా ఎంపికైన ఆయ‌న త‌న‌యుడు జ్యోతుల న‌వీన్ కూడా రెచ్చిపోతుండ‌డంతో అధికార పార్టీలో ఉన్న చంటిబాబు డ‌మ్మీగా మారిపోయారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లినా ఉప‌యోగం లేకుండా పోయింది. తన పట్ల పార్టీ అధినేత చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి, గత కొంతకాలంగా తనను పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. 

తన తండ్రి చనిపోయినా టీడీపీ నేతలెవరూ కనీసం సానుభూతి తెలపకపోవడం ఆయనను ఆవేదనకు గురిచేసిన‌ట్టు స‌మాచారం. ఇక తాజాగా పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పనులను సీఎం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించకపోవడంతో ఆయన కలత చెందినట్టు తెలుస్తోంది. దీంతో ఆయ‌న టీడీపీకి షాక్ ఇచ్చి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయ‌న వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున జగ్గంపేట బ‌రిలో ఉంటార‌ని టాక్‌.