బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ వైసీపీలోకి జ్యోతుల నెహ్రు

June 12, 2018 at 3:51 pm

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్పయాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాల్లోకి ప్ర‌వేశించ‌క ముందే వైసీపీ నేత‌ల‌కు కొండంత బ‌లం చేకూరేలా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అపూర్వ స్పంద‌న ల‌భించింది. అన్ని జిల్లాల్లో పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌న స్పంద‌న చూసి వైసీపీ నేత‌ల్లో జోష్ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి దూర‌మైన కాపులు.. ఇప్పుడు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌నే వార్త‌లు జోరందుకున్నాయి. టీడీపీ ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం, కాపు ఉద్య‌మాన్ని అణ‌గ‌దొక్క‌డం వంటివి ఆ వ‌ర్గంలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. దీంతో వైసీపీని వీడిన కాపునేత‌లు సందిగ్ధంలో ప‌డ్డార‌ట‌. వైసీపీని వీడిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కూడా ఇప్పుడు తిరిగి వైసీపీలోకి రావాల‌నే యోచ‌న‌లో ఉన్నారనే వార్త‌లు ఆ పార్టీ నేత‌ల్లో ఉత్సాహం నింపుతున్నాయి. 

 

ఏపీలో దాదాపు 25 శాతం ఉన్న కాపులు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీలు నమ్మి టీడీపీకి గంపగుత్తగా సపోర్ట్ చేశారు. దీంతో కోస్తాలో టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది. కాపులు అత్యధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రభంజనం సృష్టించింది. కాపు కార్పొరేష‌న్‌తో పాటు ఇత‌ర హామీల‌న్నీ బాబు అమ‌లు చేస్తార‌ని కాపులంతా ఎంతో ఆశ‌గా ఎదురుచూశారు. వీటితో పాటు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశంపై కాపుఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఉద్య‌మాలు చేసినా వాటిని అణ‌గ‌దొక్కేశారు చంద్ర‌బాబు! ఇవ‌న్నీ కాపు వ‌ర్గాల్లో చంద్ర‌బాబుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని పెంచేశాయి. గడిచిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు అధికారం దూరమవడానికి.. చంద్రబాబు గద్దెనెక్కడానికి కాపుల ఓట్లే కీలకంగా మారాయి.  అందుకే ఈసారి ఎలాగైనా ఆ వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. 

 

ప్ర‌స్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కాపుల్లో అసంతృప్తి ఇప్పుడు జగన్ కు అనుకూలంగా మారే అవ‌కాశ‌ముంద‌నే చ‌ర్చ మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లాలో కాపు నేతలు, ప్రజలు ఆయన్ను ఎంతగానో అభిమానించారు. యాత్రకు విశేషంగా కదిలివచ్చి మద్దతు తెలిపారు. కాపు సామాజికవర్గంలో జగన్ కు వచ్చిన ఆదరణ చూసి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే సీనియర్ నేత అయిన జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. 

 

జ్యోతుల నెహ్రూ గత‌ ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచారు. కానీ చంద్రబాబు హామీల నేప‌థ్యంలో టీడీపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి టీడీపీలో అత్యంత దారుణంగా ఉందని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి కాకుండా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. సొంత సామాజికవర్గం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే జగన్ పాదయాత్ర సందర్భంగా జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఇలా కాపు నేతలతోపాటు ఇతర సామాజిక వర్గాల్లో జగన్ కు వస్తున్న అపూర్వ ఆదరణతో తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతాయ‌న‌డంలో సందేహం లేదంటున్నారు విశ్లేష‌కులు!!

బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ వైసీపీలోకి జ్యోతుల నెహ్రు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share