కేసీఆర్‌, బాబుల‌కు చిచ్చు పెట్టిన ఐల‌య్య

ప్ర‌ముఖ విద్యావేత్త,  ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య షెఫ‌ర్డ్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆయ‌న వివాదం లేక‌పోతే.. నాగురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అని అనుకుంటారో ఏమో?  ఆయ‌న ఎప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చినా వివాదంతోనే ఉంటారు. ఈ వివాదాలు రానురాను ప్ర‌భుత్వాల‌ను తెగ ఇరుకున పెడుతున్నాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ నేత‌లు పేర్కొంటున్నారు. విజ్ఞులు, మేధావులు అయిన వాళ్లే.. త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం వివాదాల‌ను ప్రోత్స‌హించ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. 

తాజా విష‌యంలోకి వెళ్తే.. సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు! అనే శీర్షిక‌న ఐల‌య్య రాసిన ఓ పుస్త‌కం ప్ర‌చురిత‌మై మార్కెట్‌లోకి వ‌చ్చింది. ఇది పూర్తిగా వైశ్యుల‌ను కించ‌ప‌రిచేలా ఉంద‌ని ఆ వ‌ర్గాల ఆరోప‌ణ‌. దీంతో వైశ్యులు రోడ్డెక్కారు. ఐల‌య్య పుస్త‌క ప్ర‌తుల‌ను చించి పోగు పెట్టి ఆఖ‌రుకు నిప్పు కూడా పెట్టారు. అంత‌టితో ఆగ‌కుండా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉద్య‌మాల‌ను త‌ల‌పించేలా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. నిన్న సోమ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైశ్య సంఘాలు, వ్య‌క్తిగ‌తంగా వైశ్యులు కూడా రోడ్ల మీద‌కు వ‌చ్చి ప్ర‌భుత్వాల‌కు ఫిర్యాదు కూడా చేశారు.

ఇంత వ‌ర‌కుబాగ‌నే ఉన్నా.. ఐల‌య్య విష‌యంలో ప్ర‌భుత్వాలు ఇరుకున ప‌డుతున్నారు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం, విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న‌ట్టుగా త‌యారైంది ప్ర‌భుత్వాల ప‌రిస్థితి.  స‌మాజాన్ని రెచ్చ‌గొడుతున్నార‌ని ఐల‌య్యపై చ‌ర్య‌లు తీసుకుంటే ద‌ళిత సంఘాలు క‌న్నెర్ర చేసేందుకు క‌త్తుల్లాంటి విమ‌ర్శ‌ల‌తో రెడీ ఉన్నాయి. ఐల‌య్య‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. వైశ్యులు దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఎదురై.. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు కూడా విఘాతం ఏర్ప‌డ‌డంతోపాటు కుల చిచ్చు ఆర‌డం లేదు. మ‌రోప‌క్క 2019 ఎన్నిక‌లు దూసుకొస్తున్నాయి. 

ఈ క్ర‌మంలో ఇలాంటి వివాదాల‌ను చ‌ల్లార్చ‌డం తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌కు క‌త్తిమీద సాములా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయా ప్ర‌భుత్వాధి నేత‌లు త‌మ అనుకూల ర‌చ‌యిత‌ల‌తో ఐల‌య్య‌ను దువ్వి.. వైశ్యుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మో, పుస్త‌కం టైటిల్ మార్చి, వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డేలా చేయ‌డ‌మో చేయాల‌ని సూచిస్తున్నార‌ట‌. ఏపీ సీఎం అయితే, ఇదేం త‌ల‌నొప్పిరా బాబూ.. ఇప్ప‌టికే కాపుల‌తో ఛ‌స్తుంటే అని త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. గ‌తంలోనూ ఐల‌య్య ఆవు , బ్రాహ్మ‌ల విష‌యంలో తీవ్ర వివాదం సృష్టించి రోజుల త‌ర‌బ‌డి వార్త‌ల్లో నిలిచారు. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని ఇలా బ‌రితెగించ‌డం ఎంత‌మేర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జాస్వామ్య వాదులు.  మ‌రి వాళ్ల‌మీద ఎలాంటి క‌థ‌రాలు రాస్తోరో ఐల‌య్య.. చూడాలి!!