కేశినేని వ్యాఖ్య‌ల మంట‌.. బీజేపీ-బాబు మ‌ధ్య తంటా!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో రాజ‌కీయ దుమారాన్నే సృషించాయి. 2014లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు మెజారిటీ త‌గ్గింద‌ని ఆయ‌న అన్నారు. 2019లో ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ల‌క్ష పైగా మెజారిటీ సాధిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మ‌ధ్య అంతులేని అగాధాన్ని సృష్టించాయి.

కేశినేని వ్యాఖ్య‌ల‌పై గుంటూరుకు చెందిన బీజేపీ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఘాటుగానే స్పందించారు. అంతేకాదు, బాబుని ఏకేశారు కూడా.. త్వరలో అమిత్ షా విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు ముందు కేశినేని చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అని కన్నా ప్రశ్నించారు. కేశినేని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక చంద్రబాబు అభిప్రాయమా అని కూడా నిల‌దీశారు.

ఇక‌, ఈ సంద‌ర్భంగానే క‌న్నా మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తున్నామని త్వరలో చాలా మంది బడా నాయకుల పీఠాలు కదలబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కన్నా మాటల్లో మర్మం ఏంటి ? ఆ బడా నాయకులు ఎవరు ? అనే ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది.

పీఠాలు కదలబోతున్నాయంటే అది చంద్రబాబు పీఠమేనా.. కన్నా పరోక్షంగా వ్యాఖ్యానించింది చంద్రబాబు గురించేనా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా.. కేశినేని వ్యాఖ్య‌ల అనంత‌ర‌మే బీజేపీ, టీడీపీ పాలిటిక్స్ హీటెక్కాయ‌ని అర్ధ‌మ‌వుతోంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.