కర్ణాటకలో విచిత్రం బీజేపీ ఓడింది – కాంగ్రెస్ గెలిచింది

May 16, 2018 at 1:35 pm
karnataka-bjp-congress

దేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఎక్కువ శాతం ఓట్లు సాధించిన పార్టీకి స‌హ‌జంగానే ఎక్కువ సీట్లు రావాలి. త‌క్కువ ఓట్లు ప‌డిన పార్టీకి త‌క్కువ సీట్లు రావాలి. కానీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో మాత్రం ఇందుకు పూర్తి రివ‌ర్స్‌లో జ‌ర‌గ‌డమే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ వైపు క‌ర్ణాట‌క‌లోని దాదాపు 38 శాతం ఓట‌ర్లు మొగ్గుచూపారు. కానీ వ‌చ్చిన సీట్లు కేవ‌లం 78. ఇక బీజేపీ వైపు 36.2 శాతం మొగ్గు చూపారు. కానీ ఏకంగా 103 సీట్లు కైవ‌సం చేసుకుంది. ఇక బీజేపీలో స‌గం శాతం(18.2) ఓట్లు ద‌క్కించుకున్న జేడీఎస్ కేవ‌లం 37 స్థానాల‌కే ప‌రిమితమైంది. ఓట్లు ఎక్కువ వ‌చ్చినా సీట్లు త‌క్కువ గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఇది ఎలాంటి సంకేతాలిస్తోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు అనుగుణంగా ఫ‌లితాలు ఉన్నాయో లేవా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

 

ఏపీలో టీడీపీ అధికారం చేప‌ట్ట‌డానికి, వైసీపీ ఓడిపోవ‌డానికి మ‌ధ్య ఉన్న గ్యాప్ రెండు శాతం ఓట్లు! ఈ ఓట్లే టీడీపీని గ‌ట్టెక్కించాయి. అయితే ఇప్పుడు అదే రెండు శాతం ఓట్ల తేడా క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి ఓట్ల శాతం ఎక్కువగా ఉండి.. ఓడిపోయిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం పొందింది. ఆ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 78 దగ్గరే ఆగిపోయాయి. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కన్నా దాదాపుగా 2 శాతం ఓట్లు తక్కువొచ్చాయి. కానీ సీట్లు మాత్రం ఏకంగా ఇరవై ఆరు ఎక్కువొచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇంత వరకూ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. గెలి చిన పార్టీకే అంతో ఇంతో ఓట్ల ఆధిక్యం కనిపించేది కానీ తొలిసారి కర్ణాటకలో రెండు శాతం ఓట్ల తేడాతో అదీ తక్కువ వచ్చిన పార్టీ.. అధికారానికి దగ్గరగా నిలుచుంది. 

 

ఇటువంటి ప‌రిణామం ఇక్క‌డే ఇత‌ర దేశాల్లోనూ ఉంది. జూర్జిబుష్ జూనియర్ మొదటి సారి అమెరికా అధ్యక్షుడై నప్పుడు ఆయనకు ఓట్లు తక్కువొచ్చాయి. కానీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన ఎలక్టోరల్ ఓట్లు మాత్రం ఎక్కువొచ్చాయి. మొన్న డొనాల్డ్ ట్రంప్ కూడా  ఓట్లు తక్కువొచ్చినా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ తెచ్చుకుని అధ్యక్షుడ య్యారు. అమెరికాకు ప్రెసిడెంట్‌ అయిన మహిళగా హిల్లరీ క్లింటన్ ఉండాలని చాలా మెజార్టీ ప్రజలు ఆశించినా.. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఓడిపోక తప్పలేదు. దీనిపై అమెరికాలో విస్తృత‌ చర్చ జరుగుతోంది. కానీ ఏమైనా మార్పులుచేర్పులు చేయాలనే స్థాయిలో జరగడం లేదు. 

 

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా మెజారిటీ మీద ఆధారపడి ఉంది. వంద ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలిచినట్లు. అంటే లెక్కల ప్రకారం.. దేశంలో ఉన్నవారిలో ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటే వారే విజేత. కానీ మన దేశంలో అధ్యక్ష తరహా వ్యవస్థ లేదు కాబట్టి లోక్ సభ, అసెంబ్లీ సీట్ల వరకే అది పరిమితమైంది. కానీ ఓవరాల్‌గా లెక్కలేసినప్పుడు.. తేడా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇదే మొదటి సారి కాబట్టి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ  ఫలితాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేవని భావించినప్పుడు ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమవ‌డం ఖాయం. అలాంటి పరిస్థితి రాకుండా.. ఇప్పుడు ప్రభుత్వాలు, మేధావులు, ప్రజల్లో చర్చలు ప్రారంభం కావాలి. అనువైన పరిష్కారం కనుగొనాల్సి ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

కర్ణాటకలో విచిత్రం బీజేపీ ఓడింది – కాంగ్రెస్ గెలిచింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share