గ‌జ్వేల్‌కు కేసీఆర్ బైబై…. ఆ నియోజ‌క‌వ‌ర్గంపై  క‌న్ను..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రో కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌చ‌ట్టంలో పేర్కొన్న నియోజ‌క‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి ఏపీలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీతో పాటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ సైతం సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలోనే రెండు రాష్ట్రాల సీఎంలు చంద్ర‌బాబు, కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం విష‌యంలో మోడీపై ఒత్తిడి తెచ్చి స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది. జూలై చివ‌ర నుంచే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం తెలంగాణ‌లో ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాలు 153కు పెర‌గ‌నున్నాయి. ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న 7 ఎంపీ స్థానాలు 9 కానున్నాయి. ఇక ఈ పున‌ర్విభ‌జ‌న జ‌రిగాక సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్న సిద్ధిపేట జిల్లాలోని గ‌జ్వేల్‌కు గుడ్ బై చెప్పేసి యాదాద్రి జిల్లా కేంద్రంగా ఏర్ప‌డే యాదాద్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేసీఆర్ గ‌తంలో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌గా, గ‌త ఎన్నికల్లో ఆయ‌న గ‌జ్వేల్‌కు మారారు. ఇక ఎంపీగా క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు పాత నల్గొండ జిల్లా ప‌రిధిలో కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టుంది. కాంగ్రెస్‌లోని ఉద్దండులైన నాయ‌కులంద‌రూ ఇక్క‌డే ఉన్నారు. కేసీఆర్ యాదాద్రి నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ప‌డ‌డం ఖాయం. వారు కూడా టీఆర్ఎస్ అభ్య‌ర్థుల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటారు.