షా కామెంట్ల‌తో మోడీకి కేసీఆర్ ఝ‌ల‌క్‌!!

పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత‌! అచ్చు ఇప్పుడు ఈ సామెత‌నే ఒంట బ‌ట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన బీజేపీ సార‌ధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయ‌న పాల‌న‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ల‌క్ష కోట్ల‌కు పైగా ఇచ్చామ‌ని, అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా ఎక్క‌డా రాష్ట్రంలో అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని అన్నారు.

నిజానికి తెలంగాణ‌పై ఎవ‌రు ఏ ఒక్క‌మాట‌న్నా స‌హించ‌ని కేసీఆర్ ఇప్పుడు షా విష‌యంలోనూ అదేవిధంగా డిసైడ్ అయ్యారు. కానీ, ఇటీవ‌ల కాలంలో కేంద్రంతో కొంత స‌ఖ్య‌త‌గా మెసులుతున్న కేసీఆర్‌.. షా విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు నిచ్చారు. అయితే, షా కామెంట్లు పెద్ద ఎత్తున పెరిగిపోయిన నేప‌థ్యంలో.. కేసీఆరే నేరుగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో తాజా నిర్ణ‌యం కూడా తీసుకున్న‌ట్టు స‌మాచారం. మొన్న‌టికి మొన్న ప్ర‌ధాని మోడీ సూచ‌న‌ల మేర‌కు ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇప్పుడు షా కామెంట్లు విన్నాక‌.. మాత్రం ఈ విష‌యంలో పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలిసింది. నిజానికి రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్ఎస్ ఓట్లు చాలాకీలకం. ఈ పార్టీకి రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 20 వేల వరకూ ఓట్లు ఉన్నాయి.

పదకొండు లక్షల ఓట్లతో కూడిన రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో నాలుగు లక్షల 30 వేల వరకూ ఎన్డీఏ పక్షాల ఓట్లు ఉన్నాయి. ఈ మధ్యనే ప్రధానిని కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి 16 వేల వరకూ ఓట్లున్నాయి. టీఆర్ఎస్ సహకరిస్తే బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయం.

తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఏర్పడిన రాజకీయ వైరం రాష్ట్రపతి ఎన్నికను సైతం ఉత్కంఠభరితంగా మార్చేసింది. ఆశలు వదిలేసుకుంటున్న స్థితిలో విపక్షానికి టీఆర్ఎస్ తురుపు ముక్కగా మారబోతోందా? లేదా చివరలో తుస్సుమనిపిస్తారా? అన్నదే వేచి చూడాలి.