న‌ల్గొండ బైపోల్‌పై కేసీఆర్ పున‌రాలోచ‌న‌!

న‌ల్గొండ ఎంపీ గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ వ‌ర్గాల్లో భిన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఆయనతో రాజీనామ చేయించి.. ఉప ఎన్నిక నిర్వ‌హించి.. అందులో గెలిచి విపక్షాల‌కు షాక్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌..  నిర్ణ‌యించార‌నే వార్త‌లు పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే ఈలోగానే సింగ‌రేణి ఎన్నిక‌లు రావ‌డం.. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా అనుకున్న స‌మయానికంటే ముందుగానే వ‌స్తుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో.. ఇప్పుడు న‌ల్గొండ ఉప ఎన్నిక‌ల‌పై కేసీఆర్‌ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది! దీంతో ఇక గుత్తా రాజీనామా అంశం అటకెక్కిన‌ట్టేన‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి!

తెలంగాణ‌లో ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఒక్క‌టే మాట‌.. న‌ల్గొండ ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంది? ఎప్పుడెప్పుడు  కేసీఆర్ బ‌రిలోకి దిగుతారు.. అనేదే!! సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ముందుగా ఓ ఉప ఎన్నిక‌కు వెళ్లి, అక్క‌డ విజయం సాధిస్తే పార్టీకి ఊపు వ‌స్తుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నార‌నీ, అందుకే న‌ల్గొండ పార్ల‌మెంట‌రీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని అనుకున్నారు! అదే ఊపుతో ప్ర‌తిప‌క్షాలు కూడా రెడీ అయిపోయాయి. ఒక‌వేళ ఎన్నికంటూ వ‌స్తే.. తెలుగుదేశం త‌ర‌ఫున రేవంత్ రెడ్డి బ‌రిలోకి దిగ‌డానికి సిద్ధ‌ప‌డిపోయారు! న‌ల్గొండ ప‌రిధిలో త‌మ‌కే ప‌ట్టు ఉంద‌నీ, తెరాస‌ను ఓడించేందుకు తామూ సిద్ధ‌మంటూ కాంగ్రెస్ కూడా సిద్ధ‌మైపోయింది. 

ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌ల్లో ఆ వేడి త‌గ్గిపోయింది. ఇంత‌కీ.. న‌ల్గొండ ఉప ఎన్నిక అవ‌స‌ర‌మా అంటూ తెరాసకి చెందిన కొంత‌మంది నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌! నిజానికి, పార్టీ మారిన త‌రువాత కూడా తెరాస‌లో ఎంపీగా కొన‌సాగుతు న్నారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. ఆయ‌న ఎప్పుడు రాజీనామా చేస్తార‌నేది ఇంకా ఒక స్ప‌ష్ట‌త రావ‌డం లేదు! ఆయ‌న‌కు ఇస్తామ‌న్న రైతు స‌మ‌న్వ‌య క‌మిటీ ప‌ద‌వీ ఇంకా ఇవ్వ‌లేదు. ఆ ప‌ద‌వికి క్యాబినెట్ హోదా కూడా క‌ల్పిస్తామ‌ని కూడా చెప్పారు! ఒక‌వేళ ఇప్ప‌టికే గుత్తాకి కొత్త ప‌ద‌వి ఇచ్చి ఉంటే.. రాజీనామాపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసేది. గుత్తా ప‌ద‌వి మీదా, రాజీనామాకు సంబంధించి కూడా ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి ప్ర‌స్థావించ‌డం లేద‌ని తెరాస వ‌ర్గాలే చెబుతున్నాయి. 

ఇక‌ సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వాటిని కూడా తెరాస ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌లు పూర్త‌య్యాక‌, అక్క‌డి ఫ‌లితాల‌ను చూశాక న‌ల్గొండ‌పై నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయం కూడా కొంత‌మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇక గ‌డువు కంటే ముందుగానే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉంటాయంటూ కేంద్రం సంకేతాలిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు గుత్తాతో రాజీనామా చేయించినా.. వెంట‌నే నోటిఫికేష‌న్ విడుద‌ల కాక‌పోతే ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న సీఎం వ‌ర‌కూ వెళ్లింద‌ట‌. దీంతో గుత్తా రాజీనామా అంశం.. మ‌రుగున పడేసే అవ‌కాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది!!