పవన్ కి మరీ ఇంత దారుణంగానా…!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ఎలా ఉంటుందో ? ఈ లోగా ఎలా రంగులు మారుతుందో ? ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ పోటీ చేస్తాన‌ని చెప్పినా ఆ పోటీ ఒంట‌రిగా ఉంటుందా ? లేదా ? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాడా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పినా ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్‌గా మాత్రం పొలిటిక‌ల్ కార్యాచ‌ర‌ణ ప్రారంభించలేదు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మ‌రో నాలుగైదు నెల‌లు ఉంటుంది. ఆ త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్ సినిమాలు క‌మిట్ అయ్యాడు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా 20 నెల‌లు మాత్ర‌మే టైం ఉంది. త్రివిక్ర‌మ్ సినిమా పూర్త‌య్యే సరికే మ‌రో నాలుగు నెల‌లు పోతే అప్ప‌ట‌కీ ఇంకా 15 నెల‌లు మాత్ర‌మే ఉంటుంది.

జ‌న‌సేన‌కు ఇంకా క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ లేదు. అస‌లు స్టేట్ క‌మిటీలు, జిల్లా క‌మిటీల ఎంపిక ప్ర‌క్రియ కూడా ప్రారంభం కాలేదు. జ‌న‌సైనికుల ఎంపిక‌లు అంటూ గ‌త నాలుగు నెల‌లుగా కొన‌సాగుతోన్న ప్రక్రియ పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారింది. ఇక ఈ టైంలో ప‌వన్ పార్టీని ఎప్పుడు బ‌లోపేతం చేస్తాడు ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా పోటీ చేస్తాడు ? అసలు జ‌న‌సేన ద్వారా ప‌వ‌న్ ఏం చెప్పాల‌నుకుంటున్నాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

ఇక తాజాగా కేసీర్ ఢిల్లీలో ఆయ‌న మిత్రుడు ఏపీలో గెలుపోట‌ముల‌పై చేసిన స‌ర్వేను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వేలో వైసీపీకి 45 శాతం, టీడీపీకి 43 శాతం, బీజేపీకి 2.6 శాతం, పవన్ కల్యాణ్ కు 1 నుంచి 1.2 శాతం ఓట్లు వస్తాయని చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై కేసీఆర్ సెటైర్లు కూడా వేశారు. ప‌వ‌న్‌ చేతులూపితే ఓట్లు పడతయా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆయన సోదరుడు చిరంజీవి పార్టీని నడపలేక కట్టెల మోపులాగా బరువు దింపుకున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ విమ‌ర్శ‌లు చేశాడ‌ని కాదు కాని వాస్త‌వంగా చూసినా జ‌న‌సేన‌ను ప‌వ‌న్ ఏ తీరాల‌కు చేర్చాల‌నుకుంటున్నాడో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ప‌వ‌న్ ఇదే రూట్లో వెళితే జ‌న‌సేన ఫ్యూచ‌ర్ క్లోజ్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవ‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.