కేసీఆర్ వ్యాఖ్య‌ల వెనుక ఇంత కుట్ర ఉందా?

`అమ‌రావ‌తి నిర్మాణానికి మా వంతు స‌హ‌కారం అందిస్తాం. ఎప్పుడు ఏ సాయం కావాల‌న్నా అందిస్తాం` ఇదీ అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు!! కానీ ఇప్పుడు ఆయ‌నే ఏపీ అభివృద్ధికి మోకాల‌డ్డే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? ఇందుకు బీజేపీ నేత‌లు కూడా అంత‌ర్గ‌తంగా చేయూత‌నిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు! ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో విలేక‌రుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఏపీలోని రాజ‌కీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి వెనుక అంత‌రార్థం మాత్రం వేరే ఉండొచ్చ‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

తెలంగాణ‌లో తనకు ఢోకా లేదని ఆంధ్రలో ప్రభుత్వం మారొచ్చు అనే సంకేతాలిచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఢిల్లీ సమాచారం మేరకు జాతీయ మీడియా కొద్ది మంది అంతర్జాతీయ మీడియా ఈ స‌మావేశానికి హాజ‌రైంది. ఇందులో ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం మారొచ్చు అనే సంకేతాలు ఇవ్వడంతో పాటు తెలంగాణాలో మా ప్రభుత్వమే ఉంటుంది అని చెప్ప‌డం వెనుక అస‌లు కార‌ణం.. అమరావతికి వస్తున్న పెట్టుబడులు, పెట్టుబ‌డిదారుల‌ను అడ్డుకొని తెలంగాణా వైపు వారి చూపు మరల్చడానికేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణం మొదలు పెట్టబోతున్నారు. బైసన్ పోలో గ్రౌండ్స్ సచివాలయం నిర్మాణానికి ఇవ్వడానికి కేంద్రము సమ్మతించింది . సచివాలయం నిర్మించి `చూశారా మేము కట్టి చూపించాము. ఆంధ్రోళ్ల మాదిరి కాదు` అని చెప్పి ఎన్నికలకు వెళ్లడం తో పాటు పెట్టుబడిదారులకు `మేము చేశాము ఇక్కడ మాదే ప్రభుత్వం. కేంద్రంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి మీ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం అమరావతి కాదు` అనే సందేశం పంపడానికే అమరావతిలో ప్రభుత్వం మారొచ్చ‌నేలా మాట్లాడార‌ని  వివ‌రిస్తున్నారు. ఇక ప‌వ‌న్ కళ్యాణ్ ప్రభావం చూపడు అని అనడం ద్వారా పవన్ ని తక్కువ చేసి చెప్పడం వెనుక కారణం కూడా ఉంద‌ట‌.  

పవన్ ని తేలికగా తీసేయడం ద్వారా అతనికి బలం లేదని ప్రజల్లో ఒక భావన ఏర్పడటానికి చేసిన ప్రయత్నమే ఇది అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తికి పెట్టుబ‌డులు వెల్లువెత్తుతున్న త‌రుణంలో.. సీఎం స్థాయి వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. అమరావతి కి వెల్లువెత్తుతున్నపెట్టుబడులుఅమరావతికి వస్తున్న ఆదరణ నుంచి పెట్టుబడి దారుల దృష్టి హైదరాబాద్ వైపు తిప్పుకునేందుకు ఇలా మాట్లాడార‌ని, దీనికి భాజాపాలో కొద్దిమంది ఆశీస్సులు ఉన్నాయ‌ని వినిపిస్తోంది. అమ‌రావ‌తిని అడ్డుకునేందుకు స్వ‌రాష్ట్రంలోనే వారు గాక ఇప్పుడు పొరుగునుంచి కూడా దాడి మొద‌ల‌వ‌డం మింగుడుప‌డ‌ని అంశం!!