ఎలక్షన్ టైంలో కెసిఆర్ కు భారీ దెబ్బ

November 21, 2018 at 10:24 am

అనుకున్న‌ట్టే జ‌రిగింది. కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చార‌మే నిజ‌మైంది. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పిన‌ట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను తెలంగాణ భ‌వ‌న్‌కు పంపించారు. పూర్తి వివ‌రాలను బుధ‌వారం వెల్ల‌డిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యం ఇప్పుడు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఓ వైపు ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. ఇలాంటి ప‌రిణామాలు టీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.CM-KCR-2

నిజానికి.. కొన్ని రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు. ఈ క్ర‌మంలో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆయన బీజేపీలోకి వెళతారని, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మొన్న‌టికి మొన్న కోడంగ‌ల్ లో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కూడా కొద్దిరోజుల్లోనే ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఈ వార్తలను కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కొట్టివేశారు.టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలియవచ్చింది.BIG-JOLT-Two-TRS-MP-to-Join-Congress

ఇటీవ‌ల తాండూరులో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మీతో పాటు మ‌రొక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ఇద్ద‌రు కాదు ముగ్గురు అంటూ ఆయ‌న అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తోపాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా మానుకోట ఎంపీ సీతారాంనాయ‌క్ కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలో విశ్వేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి పిలుపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేసిన‌ట్లు తెలిసింది.. ఎన్నికల వేళ‌ రాజీనామా విషయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని ఆయ‌న కోరిన‌ట్లు స‌మాచారం. ఏదేమైనా.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. మిగ‌తా ఆ ఇద్ద‌రు ఎంపీలు ఎవ‌ర‌న్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎలక్షన్ టైంలో కెసిఆర్ కు భారీ దెబ్బ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share