టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర‌మోడీపై ఎక్క‌డా లేని భ‌క్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయ‌న పూర్తిగా ఆక‌ట్టేసుకున్న‌ట్టే కేసీఆర్ తాజా చ‌ర్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌నిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలను క‌లుస్తూ మ‌ద్ద‌తు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, ఏపీలోని విప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా తెలంగాణ‌లో కోవింద్‌కు కేసీఆర్ చేసిన మ‌ర్యాద‌లు చూసిన వాళ్లు షాక్ అయ్యారు. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ కంటే గొప్ప‌గా కేసీఆర్ కోవింద్‌కు మ‌ర్యాద‌లు చేశారు. కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడితో క‌లిసి వ‌చ్చిన కోవింద్‌కు కేసీఆర్‌, టీఆర్ఎస్ వ‌ర్గాలు చేసిన మ‌ర్యాద‌లు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి వెళ‌తామ‌న్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చినట్టే క‌న‌ప‌డుతోంది.

ఇప్ప‌టికే ప‌లుమార్లు మోడీని ఆకాశానికి ఎత్తేస్తోన్న కేసీఆర్‌, ఇప్పుడు ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కోవింద్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం, ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని మించి మ‌రీ అతి మ‌ర్యాదలు చేయడంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ + బీజేపీ పొత్తు ఖాయ‌మైన‌ట్టే అన్న టాక్ వ‌చ్చేసింది.