కేసీఆర్ వ్యూహం తెలిస్తే బీజేపీకి నిద్ర ప‌ట్ట‌దేమో..

రాజ‌కీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంత‌టి నేర్పరో ఇప్ప‌టికే అంద‌రూ ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు. ఆయ‌న ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప‌క్క తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పావులు క‌దుపుతుండ‌టంతో.. ఇప్పుడు ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే కాలేదు.. ఇప్పుడో కేసీఆర్ ప‌రిస్థితి కూడా అంతే అనేవాళ్లూ లేక‌పోలేదు. ఈ మాత్రం తెలియ‌కుండా ప‌దేప‌దే ఈ అంశంపై మాట్లాడటం వెనుక అస‌లు రీజ‌న్ వేరే ఉంద‌ట‌. దీనివ‌ల్ల కేసీఆర్‌కు లాభం.. బీజేపీకి న‌ష్టం లేక‌పోలేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ముస్లింలకు రిజర్వేషన్‌ అంశం తెరపైకి వచ్చింది. అయితే సుప్రీం కోర్టు జోక్యంతో ఈ అంశం మ‌రుగున‌ప‌డిపోయింది. ఇప్పుడు కేసీఆర్ మ‌ళ్లీ దీనిని తెర‌పైకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకి ఇది ప్రిపరేషన్ అని విశ్లేష‌కుల అంచ‌నా. రెండేళ్ళ ముందే సార్వత్రిక ఎన్నికల హంగామా తెలుగ‌రాష్ట్రాల్లో షురూ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ కూడా తొందరపడ్డారు. ముస్లింలకు మతం కోటాలో కాకుండా.. అంటూ రిజర్వేషన్ల అంశానికి క్యాబినెట్‌ ద్వారా గ్రీన్‌ సిగ్నల్‌ ఇప్పించేశారు. రేప్పొద్దున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం కూడా పాస్‌ చేయించేస్తారు. అక్కడితోనే కథ అయిపోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది.

న్యాయస్థానాలు షరామామూలుగానే కేసీఆర్‌ నిర్ణయాన్ని తిప్పి కొట్టబోతున్నాయి. ఇక్కడ జరగాల్సింది రాజ్యాంగ సవరణే. అది జరగాలంటే కేంద్రం సుముఖత వ్యక్తం చేయాలి. ముస్లిం రిజర్వేషన్ల‌కు ప్ర‌ధాని మోదీ ఒప్పుకునే ప‌రిస్థితి లేదు. ఇదే కేసీఆర్‌కూ కావాలి. ముస్లింలకు రిజర్వేషన్లు దక్కవు.. కానీ, కేసీఆర్‌కి రాజకీయ లబ్ది చేకూరుతుంది.. ఎలా అంటే 2019 ఎన్నికల్లో కేసీఆర్‌, బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ఇదే అస్త్రాన్ని వాడుకోబోతున్నారు. కేజీ టు పీజీ, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు.. ఇలా వ‌రుస‌గా హామీలు గుప్పించిన కేసీఆర్‌.. వాటిని నెర‌వేర్చ‌డంలో ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ వైఫల్యాల్ని కప్పిపుచుకునేందుకు, మళ్ళీ కొత్తగా ఈ రిజర్వేషన్ల నాటకం తెరపైకి తీసుకొచ్చారు.

కాంగ్రెస్‌ ఎటూ మైనార్టీ ఓటు బ్యాంకు కోల్పోవడానికి సిద్ధంగా వుండదు గనుక, టీఆర్‌ఎస్‌ నిర్ణయానికి జై కొట్టాల్సిందే. బీజేపీ మిత్రపక్షం గనుక టీడీపీ వ్యతిరేకిస్తుంది. ఇంకేముంది, తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు, ముస్లిం ఓటు బ్యాంకుని మెట్టుగా వాడుకోబోతున్నారన్నమాట. ఇంతకీ, కేసీఆర్‌ ఆశిస్తున్న పొలిటికల్‌ రిజర్వేషన్‌ ఆయనకు దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.