మోదీతో జాగ్ర‌త్త‌.. నేత‌ల‌కు కేసీఆర్ ఘాటు హెచ్చ‌రిక‌

March 8, 2018 at 12:46 pm
kcr-modi-telangana

కేంద్రంతో  ఢీ అంటే ఢీ అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌ధాని మోదీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆకాశానికి ఎత్తేసిన ఆయన.. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు వ్య‌తిరేకంగా థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేసేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ వ్యూహాల్లో ఆరితేరిన వారే! భవిష్య‌త్ ప‌రిణామాల‌ను ఊహించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇద్ద‌రూ ఇద్ద‌రే. అలాంటి వారు ఒక‌రినొక‌రు ఢీ కొట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతుంటే.. ప‌రిస్థితి ఇంకెలా ఉంటుంది. ప్రధాని మోదీపై, బీజేపీపై గట్టిగా పోరాడుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి అదే స్థాయిలో రాజకీయ ప్రతిఘటన ఎదురవుతుందని అంచనా కేసీఆర్‌ వేస్తున్నారు. అందువల్ల టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వీటిని స‌మ‌ర్థంగా తిప్పికొట్టేందుకు నేత‌ల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీచేశార‌ట‌. 

 

తెలంగాణ రాజ‌కీయాల నుంచి దేశ రాజ‌కీయ‌ల్లోకి కేసీఆర్ వెళ్లిపోతార‌ని దాదాపు ఖ‌రారైపోయింది. ఈసారి ఆయ‌న ఎంపీగా పోటీచేస్తార‌ని చెబుతున్నారు. అంతేగాక బీజేపీ, కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు త్వ‌ర‌లో ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్నారు. మోదీ మ‌న‌స్తత్వాన్ని కేసీఆర్ బాగానే అర్థం చేసుకున్న‌ట్లు ఉన్నారు. త‌న‌కు ఎవ‌రైనా ఎదురు తిరిగినా, ఆ ప్ర‌య‌త్నాలు చేసినా.. మోదీకి న‌చ్చ‌ద‌నే విష‌యం బ‌హిరంగ స‌త్య‌మే! ఈ నేప‌థ్యంలో వారిపై ఉన్న కేసుల‌ను ఒక్క‌సారిగా వెలికితీసి ఈడీ, సీబీఐ వంటి సంస్థ‌ల‌ను రంగంలోకి దించే అవ‌కాశాలూ లేక‌పోలేదు. త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వాలు వీటిని ఉప‌యోగించుకుంటాయ‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. వీట‌న్నింటినీ ముందే గ్ర‌హించిన కేసీఆర్‌.. పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 

 

 కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో మంత్రులు, ఇతర కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఏ క్షణమైనా రంగంలోకి దిగే అవకాశముందని, ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించి నట్లు సమాచారం. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని.. మంత్రులు, ఇతర ముఖ్యస్థా నాల్లో ఉన్నవారెవరైనా కాపాడుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆరేడు నెలల కింద ఇదే విషయంపై మంత్రులు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్నవారిని హెచ్చరించారని సమాచారం. అయినా ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిలో మార్పురాకపోవడంతో ఇటీవల మరోసారి హెచ్చరించార‌ట‌. 

 

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన వెలువడినప్పటి నుంచే కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులంతా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవడానికి జంకుతున్నారు. రాజకీయ వ్యూహాలను, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఫోన్లను ట్యాప్‌ చేసే అవకాశముందని, అందుకు ఆస్కారమివ్వ కుండా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఫోన్‌కాల్స్‌ కాకుండా.. కేవలం వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసి మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డు చేసే అవకాశం, ట్యాప్‌ చేసే అవకాశం లేదన్న ధీమాతోనే ఈ వ్యూహాన్ని పాటిస్తున్నారట‌. 

మోదీతో జాగ్ర‌త్త‌.. నేత‌ల‌కు కేసీఆర్ ఘాటు హెచ్చ‌రిక‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share