కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే అడ్డు!

March 21, 2018 at 6:23 pm
kcr-pedral frunt-sharadh pawar

తెలంగాణ ఉద్య‌మ సార‌ధి, ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఘ‌నంగా ప్ర‌క‌టించిన జాతీయ కూట‌మి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆదిలోనే అడ్డు పుల్లలు ప‌డుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను తిరిగి ఢిల్లీ గ‌ద్దె ఎక్క‌కుండా చేసేలా, రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలను కాపాడుకునేలా, ప్రాంతీయ పార్టీల కూట‌మితో అతి పెద్ద ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఢిల్లీలో గ‌ద్దె నెక్కించాల‌ని కేసీఆర్ భావించారు. అప్పుడే రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి రెండు రోజుల కింద‌ట ఆయ‌న స్వ‌యంగా ప‌శ్చిమ బెంగాల్‌కు వెళ్లి సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ అయ్యారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆయ‌న సుదీర్ఘంగా ఆమెతో చ‌ర్చించారు. కేంద్రంలో కొన్ని ద‌శాబ్దాల పాటు మ‌మ‌త చ‌క్రం తిప్పిన నేప‌థ్యంలో వీరిద్ద‌రి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఫెడ‌ల‌ర్ ఫ్రంట్ ఏర్పాటులో దీనిని కేసీఆర్ తొలి అడుగుగా భావించారు. 

 

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేంద్రంలో తృతీయ కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్న మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఇప్పుడు మ‌ళ్లీ చ‌క్రం తిప్పేందుకు ముందుకు వ‌చ్చారు. కేంద్రంలో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని శ‌ర‌ద్ ప‌వార్ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంటే, కాంగ్రెస్‌ను పెట్టుకుని, మిగిలిన ప్రాంతీయ పార్టీల‌తో ఆయ‌న తృతీయ కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని భావిస్తు్న్నారు. అయితే, దీనివ‌ల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను క‌లుపుకొని వెళ్లాల‌నేది శ‌ర‌ద్ ప‌వార్ ఆలోచ‌న‌. అయితే, కేసీఆర్ మాత్రం కాంగ్రెసేత‌ర‌, బీజేపీయేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు పావులు క‌దుపుతున్నారు. ఇక‌, శ‌ర‌ద్ ప‌వార్ మాత్రం త‌న దూకుడును పెంచారు. వివిధ ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల‌ను జ‌త‌క‌ట్టే ప‌నిని ఆయ‌న వేగం పెంచారు. ఈ నెల 27న ఢిల్లీలోని త‌న నివాసంలో బీజేపీయేత‌ర పార్టీల‌తో స‌మావేశం అవ్వాల‌ని ప‌వార్ నిర్ణ‌యించారు.

 

ఈ క్ర‌మంలోనే ఆయ‌న యూపీ విప‌క్షం  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానం పంపారు. దీంతో ఆమె  ఈ స‌మావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారని తెలిసింది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండే ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీకి అవకాశాలున్నాయని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. మ‌రోప‌క్క‌, కేసీఆర్ భావిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు  బీజేపీయేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని మ‌మ‌త‌ సూచించారని స‌మాచారం. 

 

ఈ నేపథ్యంలోనే శరద్‌పవార్‌ ఇంట జరిగే సమావేశానికి బీజేపీయేతర పార్టీలు ఎన్ని హాజరవుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. వాటి సంఖ్య తక్కువగా ఉంటే బీజేపీయేతర పార్టీల్లో అత్యధికం కాంగ్రెస్‌ నాయకత్వంలో ఏకమయ్యేందుకు సుముఖంగా లేవనే సంకేతాలు వెలువడుతాయి. ఒకవేళ అధిక సంఖ్యలో విచ్చేస్తే…ఆ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్‌ నాయకత్వంలో పనిచేయటానికి సిద్ధమనే అభిప్రాయం కలుగుతుంది. ఇదే జరిగితే కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలు సన్నగిల్లినట్లేనని రాజకీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా..కేసీఆర్ భావిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు అంత ఈజీ కాద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే అడ్డు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share