ఆఖ‌రి బంతి.. చివ‌రి ఏడాది..కిర‌ణ్‌తో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదా..?

July 14, 2018 at 12:26 pm
Kiran-Congress-

కిర‌ణ్ కుమార్‌రెడ్డి.. ఉమ్మ‌డి రాష్ట్రానికి చివ‌రి ముఖ్య‌మంత్రి.. రాష్ట్ర విభ‌జ‌న గ‌ట్టిగా.. సూటిగా వ్య‌తిరేకించిన నేత‌.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొడ‌తానంటూ చెప్పి.. ఆఖ‌రికి కొట్ట‌లేక ఆంధ్రుల చేత తిట్ల‌పాలైన ముఖ్య‌మంత్రి.. రాష్ట్ర విభ‌జ‌న‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణ‌మంటూ అధిష్టానంపై ధిక్కార స్వ‌రం వినిపించిన కిర‌ణ్ సొంతంగా జై స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఫ‌లితం లేకుండా పోయింది.. ఆంధ్రుల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకోలేక‌పోయానన్న భావోద్వేగంతో నాలుగేళ్లుగా సైలెంట్‌గా ఉన్న కిర‌ణ్‌.. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఆఖ‌రి ఏడాదిలో రంగంలోకి దిగారు.. అదికూడా.. రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీలోనే ఆయ‌న శుక్ర‌వారం రాహుల్ స‌మ‌క్షంలో చేరారు. 

 

అయితే.. ప్ర‌జ‌ల్లో అంత‌గా బ‌లం లేకున్నా.. కేవ‌లం గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే ఆయ‌నకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే.. రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిందంటూ కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్న కిర‌ణ్ ఇప్పుడు అదే పార్టీలో చేర‌డంతో ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌న్న దానిపైనే ఏపీలో ఆస‌క్తిక‌ర‌మైన చర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీతోనే తెలుగు రాష్ట్రాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌నీ.. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చిన అంశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కిర‌ణ్ చెబుతున్నారు.. ఇప్పుడు ఆయ‌న మాట‌ల్నిఆంధ్రులు విశ్వ‌సిస్తారా..?  లేదా..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. 

 

మ‌రోవైపు.. నాలుగేళ్ల‌పాటు కిర‌ణ్ సైలెంట్‌గా ఉండ‌డంతో ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం కూడా త‌మ‌దారి తాము చూసుకుంది. దాదాపుగా ఆయ‌న ద్వితీయ‌, త‌`తీయ శ్రేణి అనుచ‌రులు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లారు. ఆఖ‌రి కిర‌ణ్ సోద‌రుడు కిశోర్‌కుమార్‌రెడ్డి కూడా జై స‌మైక్యాంధ్ర పార్టీని వీడి అధికార టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం కిర‌ణ్ కుటుంబానికి కొంత‌మేర‌కు ప‌ట్టుంది. కిర‌ణ్‌, ఆయ‌న తండ్రి అమ‌ర‌నాథ‌రెడ్డి నాలుగుసార్లు వాల్మీకిపురం, పీలేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. అలాగే మ‌ద‌న‌ప‌ల్లె, తంబ‌ళ్ల‌ప‌ల్లె, ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి కొంత ప‌ట్టుంది. 

 

ప్ర‌స్తుతం మ‌ద‌న‌ప‌ల్లె, చిత్తూరుకు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు కిర‌ణ్‌తో టచ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కిర‌ణ్ ప్ర‌భావం చూపే అవ‌కాశాలు మాత్రం క‌నిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. శుక్ర‌వారం కిర‌ణ్ తండ్రి అమ‌ర‌నాథ‌రెడ్డి వ‌ర్ధంతి కావ‌డంతో ప‌లు ప్రాంతాల్లో అనుచ‌రులు ఈ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏదేమైనా.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్ట‌లేక చ‌తికిల‌ప‌డిన కిర‌ణ్ ఆఖ‌రి ఏడాదిలో ఏం చేస్తారో చూడాలి మ‌రి. 

ఆఖ‌రి బంతి.. చివ‌రి ఏడాది..కిర‌ణ్‌తో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share