కోదండ‌రాం టార్గెట్ ప్ర‌తిప‌క్షాలేనా..!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం.. ఎంట్రీతో ఇవి మ‌రింత హీటెక్కాయి. ప్ర‌స్తుతం విప‌క్షాల‌న్నీ ఆయ‌న్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్ర‌తిప‌క్షాల్లో స‌రికొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని స‌మాచారం. ఆయ‌న సొంతంగా పార్టీ పెడ‌తార‌నేప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్న త‌రుణంలో.. పార్టీలోంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మైతే త‌మపార్టీల‌ భ‌విష్య‌త్తు అంధ‌కారంలో ప‌డిపోయిన‌ట్టేన‌ని ఆందోళ‌న చెందుతున్నాయి. అస‌లే కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు స‌గం కుదేల‌వ్వ‌గా.. మిగిలిన‌ది కోదండ‌రాం వ‌ల్ల నష్ట‌పోతామ‌ని మ‌ధ‌న‌ప‌డుతున్నార‌ట‌.

టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు కోదండ‌రాం. అంతే స్థాయిలో ఆయ‌న‌పైనా ఎద‌రుదాడికి దిగుతున్నారు గులాబీనేత‌లు! తెలంగాణ సాధించిన త‌ర్వాత‌.. ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కొట్టేశారు. కేసీఆర్ తో సమానంగా పోరాటాన్ని నడిపించినా.. రాజకీయంగా అసలు నామమాత్రపు స్థానం కూడా కోదండ‌రామ్‌కి దక్కలేదు. ఇది కూడా ఆయనను సొంత పార్టీ స్థాపన దిశగా ప్రేరేపించింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గా ల స‌మాచారం. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఎదిగేందుకు వేచిచూస్తున్న త‌రుణంలో ఇన్నాళ్లకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఈ వార్త గులాబీ ద‌ళంలో క‌న్నా.. ప్ర‌తిప‌క్షాల్లో ఎక్కువ క‌ల‌వ‌రం పుట్టిస్తోంద‌ట‌. కోదండరాం పార్టీ పెడితే.. కొన్ని పార్టీలు ఖాళీ అవుతాయని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ దెబ్బ‌కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుదేలైపోయాయి. పార్టీని వీడ‌లేక‌.. భావ వైరుధ్యం వ‌ల్ల కొంత మంది నేత‌లు ఇంకా ఆ పార్టీల్లోనే కొన‌సాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కోదండరాం గనుక కొత్త పార్టీ పెడితే.. కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణుల్లోని అనేక మంది అందులోకి జంప్ చేసేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ లో వ‌ర్గ‌ కుమ్ములాటలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక తెలుగుదేశం సంగ‌తి తెలిసిందే! ఆ పార్టీలోనూ ఇప్పుడుఉ ఆధిప‌త్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో వారంతా ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నార‌ట‌. కోదండరాం పార్టీ పెడితే వీరంతా అందులోకి జంప్ చేయ‌వ‌చ్చని తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ కంటె కూడా తెదేపాకు ఇంకా పెద్ద దెబ్బ పడుతుందనే ప్రచారం ఉంది. దీంతో ఇక ఈ రెండు పార్టీలు దాదాపు ఖాళీ అయ్యే ప‌రిస్థితి వ‌స్తుంద‌ట‌. మ‌రి కోదండ‌రాం కొత్త పార్టీ పెడ‌తారో లేదో వేచిచూద్దాం!