గెలుపుకోసం శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే

మాజీ మంత్రి న‌డికుదిటి న‌ర‌సింహారావు రాజ‌కీయ వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు ర‌వీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫ‌స్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం (బంద‌రు) నుంచి 2009లో ఫ‌స్ట్ టైం పోటీ చేసిన ర‌వీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓట‌మి చూసినా ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌తిరిగి పార్టీలో ప‌ట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి రాజ‌కీయవ‌ర్గాల అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేయ‌డంతో పాటు అనూహ్యంగా ఎక్సైజ్ మంత్రిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

కొల్లు ర‌వీంద్ర‌కు వ్య‌క్తిగ‌తంగా మెత‌క వైఖ‌రితో ఉంటార‌న్న మంచి ఇమేజ్ ఉంది. అదే టైంలో ఆయ‌న మంత్రిగా ఈ మూడేళ్ల‌లో త‌న శాఖ‌ల మీద ప‌ట్టు సాధించ‌డంలో ఫెయిల్ అవ్వ‌డంతో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న‌కు కీల‌క శాఖ‌ల్లో కోత‌ప‌డింది. ప్ర‌స్తుతం ర‌వీంద్ర చేతిలో క్రీడ‌లు, న్యాయ‌, యువ‌జ‌న శాఖ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల యూత్‌ను మెప్పించే ప‌లు కార్య‌క్ర‌మాల ద్వారా కాస్త ప‌బ్లిసిటీలో ముందుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఏపీలో అధికార టీడీపీకి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన, కీల‌క‌మైన బంద‌రు పోర్టు భూసేక‌ర‌ణ విష‌యంలో రైతుల నుంచి వ‌చ్చిన తీవ్ర వ్య‌తిరేక‌త‌ను, అల‌జడిని ఆయ‌న స‌రిగా డీల్ చేయ‌లేక‌పోయారు. ఈ కీల‌క ప్రాజెక్టు విష‌యంలో ఆయ‌న రైతుల నుంచి బాగా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడాకొట్టినా అది కొల్లు ర‌వీంద్ర‌కే కాదు అధికార టీడీపీకి పెద్ద మైన‌స్ అవుతుంది.

ఇక మంత్రిగా ఉన్నా జిల్లాలో సీనియ‌ర్ మంత్రి ఉమాతో పోల్చుకుంటే ర‌వీంద్ర వ‌ల్ల పార్టీకి ఒరిగిందేమి లేదు. ర‌వీంద్ర మాట‌ను చాలా విష‌యాల్లో అధికారులు సైతం లైట్ తీస్కోంటార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిప‌రంగా మాత్రం ఆయ‌న కొన్ని విష‌యాల్లో స‌క్సెస్ అయ్యారు. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు ముందు ఊస్టింగ్ లిస్టులో ర‌వీంద్ర పేరు ఉన్నా క్యాస్ట్ ఈక్వేష‌నే ఆయ‌న‌కు శ్రీరామ‌ర‌క్ష అయ్యింది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– పార్టీ ప‌ట్ల క‌మిట్‌మెంట్ ఉన్న వ్య‌క్తి

– లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉండ‌డం

– వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడ‌న్న ఇమేజ్‌

– రూ. 30 కోట్ల‌తో మంగిన‌పూడి బీచ్ అభివృద్ధి

– మ‌చిలీప‌ట్నంలో నూటికి నూరుశాతం సీసీ రోడ్లు

– అమృత స్కీం ద్వారా అండ‌ర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్ ప్ర‌తిపాద‌న‌లు

– ఎన్డీఆర్ హౌసింగ్ స్కీం ద్వారా 2 వేల ఇళ్లు మంజూరు

మైన‌స్ పాయింట్స్ (-) :

– మంత్రిగా స్టేట్‌లో కాదు క‌దా జిల్లాలోను ప్ర‌భావం చూప‌క‌పోవ‌డం

– సొంత శాఖ‌ల్లోనే స‌రైన క‌మాండింగ్ లేక‌పోవ‌డం

– ఆరోప‌ణ‌ల‌తో కీల‌క‌మైన ఎక్సైజ్ శాఖ కోల్పోవ‌డం

– పోర్టు భూసేక‌ర‌ణ‌పై రైతుల్లో వ్య‌తిరేక‌త‌

– వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎఫెక్ట్‌

– ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జ‌నుడుతో స్వ‌ల్ప విబేధాలు

– వైసీపీ నుంచి స్ట్రాంగ్ ప్ర‌త్య‌ర్థిగా పేర్ని నాని దూకుడు

– చంద్ర‌బాబు ర్యాంకింగ్‌లోనే చాలా వెన‌క‌బాటు

– ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో కాపు వ‌ర్గం

తుది తీర్పు :

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొల్లు ర‌వీంద్ర‌కు క్యాస్ట్ ఈక్వేష‌న్‌లో టిక్కెట్టు రావ‌డంలో ఇబ్బంది లేదు. కృష్ణా జిల్లాలో మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గానికి చెందిన ర‌వీంద్ర‌కు మ‌రోసారి బంద‌రు టిక్కెట్టు క‌న్‌ఫార్మ్‌గా వ‌స్తుంది. జ‌న‌సేన పోటీ చేస్తే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు చాలా వ‌ర‌కు ఆ పార్టీ వైపే మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి. మ‌రోవైపు వైసీపీ నుంచి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా పేర్ని నాని ఉన్నారు. ఆయ‌న గ‌తంలో రెండుసార్లు వ‌రుస‌గా బంద‌రు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి ర‌వీంద్ర‌ను సైతం ఓడించిన అనుభ‌వం నానికి ఉంది.

మ‌రోవైపు మంత్రిగా ఉన్న ర‌వీంద్ర‌, ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీ అయిన బ‌చ్చుల అర్జ‌నుడు ముగ్గురూ బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారే కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఉన్న కాపులు త‌మ‌కు ప‌ద‌వులు లేవ‌ని మండిప‌డుతున్నారు. మ‌చిలీప‌ట్నం మునిసిప‌ల్ చైర్మ‌న్ సైతం కాపుల‌కు కాకుండా వైశ్యుల‌కు ఇవ్వ‌డం వారికి మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో కాపుల్లో చాలా మంది టీడీపీకి దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వీటితో పాటు జ‌న‌సేన పోటీ చేస్తే కూడా ర‌వీంద్ర గెలుపుకోసం శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే.