
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే దీనికి ముందు కొండాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బుజ్జగించే క్రమంలో కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నీకేం ఢోకా లేదు…నేనున్నానంటూ భరోసా ఇస్తునే కొంత హెచ్చరిక ధోరణిని ప్రదర్శించారట. వచ్చే 15 ఏళ్లు..20 ఏళ్లకు నేనే సీఎంగా ఉంటాను..ఎందుకు అంతా నాశనం చేసుకుంటావు అని వ్యాఖ్యనించారట. ఇప్పుడు ఆయన కామెంట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఇప్పటికే ఆయనపై చిన్న సీఎం అనే ముద్రపడింది. అనేక నిర్ణయాలు సీఎం కేసీఆర్ తెలియకుండానే…లేదా ఒత్తిడి పెంచి ఆయన తీసుకునేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు వేలెత్తి చూపుతూ..ఆయన అతి విశ్వాసానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని తమ రాజ్యంగా భావిస్తున్నట్టు ఉన్నారని విమర్శిస్తున్నారంట. వారసత్వం రాజకీయాలతో కుటుంబ పాలనను మరో ఇరవై ఏళ్లు వారిని కొనసాగనివ్వడానికి ప్రజలేం అమాయకులు కాదని, అన్నాళ్లు కాదు…వచ్చే ఎన్నికల్లోనే ప్రజలే గుణపాఠం చెబుతారని మండిపడుతున్నారు. ఎంపీ పార్టీకి రాజీనామా అనంతరం హరీష్, కేటీఆర్, కేసీఆర్ నేతల కదలికలపై ద`ష్టి సారించినట్లు సమాచారం. ఎవరెవరూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నది ఆరా తీస్తున్నారట. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కొట్టి పారేయాలేని పరిస్థితని గులాబీ ముఖ్య నేతలు అనుకుంటున్నారట.
ఎన్నికల ప్రచారంలో తారస్థాయికి చేరుకున్న వేళ కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారుతాయనే భావనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ కుటుంబ నియంత`త్వ ధోరణికి..ఆలోచన..ఆచరణకు కేటీఆర్ వ్యాఖ్యలు నిదర్శనమని ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు టీఆర్ ఎస్‌లో అవసరార్థం కొనసాగుతున్న నేతలు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆఫర్లను..హామీలను పరిగణలోకి తీసుకుంటున్నారంట. వచ్చే లోక్ సభ స్థానాలపై కొంతమంది గురిపెట్టుకున్న నేతలు..తమకు కాకున్నా తమ వారసులకు టికెట్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిట్టింగ్‌లు ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం రాహుల్‌తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.