ల‌గ‌డపాటి టీడీపీ ఎంట్రీ..ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎర్త్‌..!

ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు మ‌ళ్లీ రాజ‌కీయాల్లో బ‌లంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభ‌జన జ‌రిగితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఆ మాట‌కు ఇన్నాళ్లూ క‌ట్టుబ‌డి ఉన్నారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న రాజ‌కీయా ల్లోకి రావాల‌నే ఒత్తిడి ఇప్పుడు విప‌రీతంగా పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో భేటీ, ఇత‌ర రాజ‌కీయ ప‌రిణామాల త‌రుణంలో.. ఆయ‌న టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం కూడా జోరుగా జ‌రుగుతోంది. ఇప్పుడు ఆయ‌న టీడీపీలో చేరితే.. ఎవ‌రికి ఎర్త్ పెడ‌తారు అనే అంశంపై టీడీపీలో చ‌ర్చ మొద‌లైంద‌ట‌. ఆయ‌న ఎంట్రీ వార్త‌ ఇద్ద‌రిని మాత్రం బాగా టెన్ష‌న్ పెడుతోంద‌ని తెలుస్తోంది!

రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా.. త‌న స‌ర్వేల‌తో నిత్యం ప్ర‌జ‌లంద‌రికీ ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్! ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌ర్వేకు ఇంచుమించుగా ఫ‌లితాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే! ఇప్పటికీ ఆయ‌న‌కు విజ‌య‌వాడ‌లో మంచి మ‌ద్ద‌తు ఉంది. అంతేగాక టీడీపీ అధినేత చంద్ర బాబుకు ఆయ‌న స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తుండంతో.. రాజ‌కీయాల్లోకి ఆయ‌న ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు గుప్పుమంటు న్నాయి. లగడపాటి రాజగోపాల్ ను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం… లగడపాటి సమైక్య ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ లో హీరో అయ్యారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చి సంచలనం సృష్టించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసి పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పెప్పర్ స్ప్రే చల్లి సెన్సేషన్ సృష్టించారు. పెప్పర్ స్ప్రే చల్లడంపై దేశవ్యాప్తంగా లగడపాటి విమర్శలను ఎదుర్కొన్నా ఏపీలో మాత్రం ఆయనను హీరోగానే భావిస్తున్నారు. చివరి నిమిషం వరకూ రాష్ట్ర విభజన జరగకుండా ప్రయత్నించింది లగడపాటేనని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈనేపథ్యమున్న లగడపాటిని పార్టీలోకి తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో లాభమేనన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయనతో రెండు, మూడుసార్లు భేటీ అయ్యారు చంద్రబాబు. తాను పిలిపించుకుని మరీ భేటీ అయ్యారు!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత కూడా అడ‌గ‌డంతో లగడపాటి పునరాలోచనలో పడ్డార‌ట‌. లగడపాటి టీడీపీ లో చేరితే విజయవాడ, గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయించాలన్న యోచనలో సీఎం ఉన్నారని సమా చారం. విజయవాడ ఎంపీగా కేశినాని నాని, గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. త‌న‌కు ప‌ట్టున్న‌ విజయ వాడలో పోటీకే లగడపాటి మొగ్గు చూపే అవకాశముంది. ఈ నేప‌థ్యంలో నానిని కన్విన్స్ చేయాలని సీఎం భావిస్తున్నా రు. నాని ఒప్పుకోకపోతే గల్లా జయదేవ్ ను చంద్రగిరి అసెంబ్లీకి పంపి గుంటూరు ఎంపీకి లగడపాటిని పోటీ చేయించే అవకాశముంద‌ట‌. దీంతో వీరిద్ద‌రిలోనూ ఒకరికి లగడపాటి షాకిచ్చే అవకాశముంది.