విజ‌య‌వాడ టీడీపీ ఎంపీగా ల‌గ‌డ‌పాటి?

ఆంధ్రా ఆక్టోప‌స్ మ‌ళ్లీ రాజకీయాల్లో బిజీబిజీ కాబోతున్నారా? రాజ‌కీయ సన్యాసం ప్ర‌క‌టించిన ఆయ‌న మ‌ళ్లీ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోబోతున్నారా? విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌… సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? మ‌ళ్లీ త‌న‌కు క‌లిసొచ్చిన విజ‌య‌వాడ నుంచే పోటీ చేయ‌బోతున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటి ఏకాంతంగా భేటీ కావ‌డం స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తోంది.

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇటీవ‌ల మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏపీ సీఎం చంద్ర‌బాబును ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యాన్ని సంద‌ర్శించారు. అంతేగాక స‌చివాల‌యం చాలా బాగుంద‌ని కితాబిచ్చారు. ప‌నిలోపనిగా చంద్ర‌బాబును కూడా మ‌ళ్లీ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. అనంత‌రం ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు. దీనిపై టీడీపీ వ‌ర్గాల్లో రాజ‌కీయ చ‌ర్చ మొద‌లైంది. ఇటీవ‌లి కాలంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ప‌నితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విష‌యం తెలిసిందే!

కేశినేని ట్రావెల్స్ వ్య‌వ‌హారం, ఆయ‌న ప‌నితీరుతో పార్టీకి ఇబ్బందులు వ‌స్తాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను మార్చాల‌ని యోచిస్తున్నార‌ట‌. అంతేగాక నాని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్‌ నడపనుంటూ ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్న తానే వ్యవస్థనే మార్చలేకపోతున్నానని, ఆ మార్పులు చూసి తట్టుకేలేక తన ట్రావెల్స్‌ మూసివేస్తున్నానంటూ కేశినేని నాని బాహాటంగానే నిరసన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేశినేని నానికి చెక్‌ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుతున్నాయి.

ఈ భేటీపై ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించాయి. 2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి కేటాయించబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. విజ‌య‌వాడ పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందిన రికార్డు లగ‌డ‌పాటి సొంతం. 2019 విజ‌య‌వాడ ఎంపీ సీటు కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే చంద్రబాబుతో తన భేటీ మర్యాదపూర్వకమే అని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ల్యాంకో ప‌వ‌ర్ ప్లాంట్‌కు సంబంధించిన అంశాల‌పై ముఖ్య‌మంత్రిని క‌లిశార‌ని ఫీల‌ర్‌. మ‌రి రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే!!