మోడీ టీడీపీకి దూరంగా..వైసీపీకి దగ్గరగా దేనికి సంకేతం!

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ శ‌త్ర‌వులుగా ఉన్న నేత‌లు.. ఇప్పుడు క‌త్తులు దూసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రి టీడీపీ పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. త‌మ పార్టీనేత‌ల‌కు ఎన్నో గంట‌లు, రోజులు వేచిచూస్తేనే గాని దక్కిన మోడీ అపాయింట్‌మెంట్‌.. వైసీపీ నేత‌ల‌కు క్ష‌ణంలోనే ద‌క్క‌డంపై వీరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్న‌టికి మొన్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గ‌ర నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాలు టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ త‌రుణంలో ఇప్పుడు వైసీపీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తి.. ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి మ‌ధ్య‌.. వైరం ఈనాటిది కాదు! ఇప్పుడు చంద్ర‌బాబుకు ఆమె ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం నేత‌లంతా వెయిట్ చేస్తూ ఉంటే.. వైసీపీ నేత‌ల‌కు మాత్రం అత్యంత సులువుగా ఇది ద‌క్కుతోంది. మరీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించే వారికి, ఆయ‌న్ను శ‌త్రువులుగా భావిస్తున్న వారికి మ‌రింత సుల‌భంగా మోడీతో భేటీ అవుతుండ‌టం టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. చంద్రబాబుకు ఈ భూ ప్రపంచం మీద ఉన్న శత్రువుల్లో తనదే మొదటి స్థానం అని తరచూ లక్ష్మీ పార్వతి చెబుతూ ఉంటారు. మరి అలాంటి బాబు శత్రువులకు మోడీ దర్శనం వరసగా లభిస్తోంది.

మొన్న జగన్ కు ఇప్పుడు లక్ష్మీ పార్వతికి. జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారంటే.. అది బాబును బ్లాక్ మెయిల్ చేయడానికే అంటూ టీడీపీ నేత‌లు స‌మ‌ర్థించుకుంటున్నారు. అయితే ఇప్పుడు వ‌రుస‌గా వైసీపీ నేత‌ల‌కు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంతో చంద్ర‌బాబు హ‌వా కేంద్రంలో త‌గ్గింద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేంద్రంతో, మ‌రీ ముఖ్యంగా మోడీతో ఎంతో స‌ఖ్య‌త‌గా ఉండే చంద్ర‌బాబుకు మాత్రం మోడీ ద‌ర్శ‌న భాగ్యం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం! మొన్నామధ్య గుజరాత్ లో చేనేత మీద ఏదో ఎగ్జిబిషన్ జరిగితే బాబుగారు అక్కడకు కూడా వెళ్లారు.

సీఎం స్థాయి వారు హాజరయ్యే కార్యక్రమం కాకపోయినా, మోడీ ఆ కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసి చంద్రన్న అక్కడ తేలారు. మరి అక్కడైన మోడీతో సమావేశం సాధ్యమవుతుందేమో అని ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదని తెలుస్తోంది. చివరి సారి మోడీని బాబు ఏకాంతంగా కలిసిందెప్పుడు? అంటే.. చెప్పడం కష్టం అయిపోయింది. మరి ఈ సంకేతాల‌న్నీ దేనికి నిద‌ర్శ‌నమ‌నే ప్రశ్న‌లు రాజకీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి!