ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి… ఏం చెప్పితిరి లోకేష్‌

రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీడీపీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రాష్ట్రంలో మంత్రి ప‌ద‌విలో ఉన్న సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ అధికారం చేప‌ట్టి ఐదు నెల‌లు గ‌డుస్తున్నా.. పార్టీలో అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు పూర్త‌వుతున్నా ఆయ‌న మాట‌లు త‌డ‌బ‌డుతూనే ఉన్నాయి. ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. గ‌తంలోనే అనేక సార్లు ఆయ‌న మాట‌లు త‌డ‌బ‌డ్డాయి. దీంతో వైసీపీ నేత‌లు రోజా, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటి వారు లోకేష్‌తో గేమ్ ఆడేసుకున్నారు. అయినా కానీ మ‌నోడు త‌న పంథా మార్చుకోవ‌డం లేదు. ఎలాంటి అవ‌గాహ‌నా లేకుండానే త‌న వ్యాఖ్య‌ల‌ను తాను తిప్ప‌లు ప‌డుతూ.. జ‌నాన్ని తిప్ప‌లు పెడుతున్నారు.

తాజాగా మంత్రి లోకేష్ ఒక కార్యక్రమంలో ఇంగ్లిష్ లో ప్రసంగిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ కంట్రీ..’ అని వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, దేశం కాదు. అది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ను దేశంగా చేసేశాడు. ఇక, అంత‌టితో ఆగ‌కుండా ఈ రాష్ట్రాన్ని కంపెనీగా కూడా అభివర్ణించాడు లోకేష్. ‘ఆంధ్రప్రదేశ్ కంపెనీ..’ అని కూడా ఆయన సెల‌విచ్చారు. దీంతో స‌భ‌కు హాజ‌రైన‌వారు ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు. ఇక‌, టీవీల్లో చూసిన వారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

గ‌తంలోనూ లోకేష్ ఇలానే నోరు జారారు. తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి లేదు అని చెప్ప‌పోయి.. పొరపాటుగా ఎక్కువ‌ని చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అయితే… టీడీపీకి ఓటేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ప్రకటించి.. ప‌రోక్షంగా టీఆర్ ఎస్‌కి స‌హ‌క‌రించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన తీరు ప్రహసనం అయ్యింది.

ఇక అంబేద్కర్ జయంతిని, వర్ధంతిగా మార్చడం, ఏపీకి నీటి సమస్యను తెచ్చిపెడతాను అని చెప్పడం, సీనియర్ ఎన్టీఆర్ ఒక తిండిపోతు.. అన్నట్టుగా మాట్లాడటం.. ఇవన్నీ లోకేష్ చెప్పిన తేనెలొలికే మాట‌ల మూట‌లు! మ‌రి ఎప్ప‌టికి మార‌తాడో చూడాలి. మొత్తానికి తండ్రి చంద్ర‌బాబు మాట‌లు కోట‌లు దాటుతుంటే.. లోకేష్ మాట‌లు.. ఇలా హ‌ద్దులు దాటుతున్నాయి!