చిన‌బాబు డైరెక్ష‌న్‌లో మంత్రికి వ్యూహాత్మ‌క చెక్‌

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు! ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా.. ఆయ‌న వెంట‌నే న‌డుస్తున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాలను శాసిస్తూ చ‌క్రం తిప్పుతున్నారు. అయితే మంత్రి వర్గంలోకి చంద్ర‌బాబు త‌న‌యుడు వ‌చ్చాక‌.. ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయ‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్య‌మైన నేత‌లంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియ‌ర్ల‌కు కొన్ని విష‌యాల్లో చెక్ త‌ప్ప‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. లోకేష్ దెబ్బ ఇప్పుడు య‌న‌మ‌ల‌కు బాగా త‌గులుతోంద‌ట‌. జిల్లాలో ఆయ‌న ప్రాభ‌వం క్ర‌మంగా త‌గ్గుతోంద‌నేందుకు ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి!

ప్ర‌స్తుతం య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి హ‌వా.. త‌గ్గిపోతోంది. నిన్న మొన్న‌టివ‌ర‌కూ జిల్లాలో ఆయ‌న చెప్పిందే వేదం! ఆయ‌న రిఫ‌ర్ చేసిన వ్య‌క్తికే ప‌దవులు క‌ట్ట‌బెట్టేవారు చంద్ర‌బాబు!! అయితే ఇప్పుడు ఆయ‌న మాట చెల్లుబాటు కావ‌డం లేదు! ఒక‌టి కాదు రెండు కాదు ప్ర‌తి విష‌యంలోనూ య‌న‌మ‌లకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అంతేగాక ఆయ‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం నానాటికీ బ‌లం పుంజుకుంటోంది. చినబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించాక పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమలను వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. అధిష్టానం వేస్తున్న ఎత్తులకు అనుగుణంగా జిల్లాలో యనమల ప్రత్యర్థి వర్గం పైఎత్తులు వేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.

య‌న‌మ‌ల ఏది చెప్పినా దానికి భిన్నంగా అధిష్టానం చేస్తూ పోతుండడంతో మంత్రి అనుచరులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకుంది. ఇటీవల జ్యోతుల నవీన్‌ను జెడ్పీ చైర్మన్‌ కాకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. యనమల అభిప్రాయానికి భిన్నంగా నామన రాంబాబును బలవంతంగా రాజీనామా చేయించి, జ్యోతుల నవీన్‌ను జెడ్పీ చైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టింది. తర్వాత అన్నవరం దేవస్థానం ఈఓ విషయంలోనూ మొండి చేయి ఎదురైంది. యనమల సిఫార్సు చేసిన  పూర్వపు ఈవో, ప్రస్తుత పెనుగంచి ప్రోలు ఈఓ రఘునాథ్‌ ఇక్కడికి రాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు చెక్‌ పెట్టారు.

కాకినాడ కార్పొరేషన్‌ మేయర్‌ విషయంలో మరోసారి చుక్కెదురైంది. తాను చెప్పినోళ్లకే మేయర్‌ పదవి ఖరారవుతుందని అనుచరుల వద్ద చెప్పుకున్నప్పటికీ అధిష్టానం సీల్డ్‌ కవర్‌ రాజకీయంతో పెద్ద ఝలక్‌ ఇచ్చింది. కాకినాడ డీఎస్పీ పోస్టు విషయంలో య నమల మాట చెల్లుబాటు కావడం లేదు. కాకినాడ డీఎస్పీగా పనిచేసిన ఎస్‌.వెంకటేశ్వరరావుకు బదిలీ తప్పని సరయింది. రెండు నెలల క్రితం కొవ్వూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించ లేదు. ఎంపీ తోట నర్సింహం ఆధ్వర్యంలో యనమల ప్రత్యర్ధి నేతలంతా ఒక్కటై అధిష్టానం స్థాయిలో  తమదే పైచేయి అనిపించుకున్నారు. ఇదంతా చినబాబు డై రెక్షన్‌లోనే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.