మ‌హాకూట‌మి ఏర్పాటు ఇక లాంఛ‌న‌మేనా?

ఈసారి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలి.. ఇదే ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న అన్ని పార్టీల ల‌క్ష్యం! మొదట్లో ఒంట‌రిగానే ఈ ప్ర‌యత్నం చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించినా.. త‌ర్వాత సీన్ అర్థ‌మైపోయింది. ఒంటరిగా ఢీ కొట్ట‌డానికి త‌మ స్టామినా స‌రిపోదని గుర్తించారు. ఒంట‌రిగా పోరాడితే అస‌లుకే ఎస‌రు వ‌స్తుందని భావించిన నేత‌లం ద‌రూ కొన్ని రోజులుగా ఐక్య‌తా రాగం పాడుతున్నారు. ఇందుకోసం విభేదాలు ప‌క్క‌న పెట్టారు. సిద్ధాంతాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎలాగైనా స‌రే.. కేసీఆర్‌ను గ‌ద్దె నుంచి దింపాల‌నే ల‌క్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు మ‌హా కూట‌మి ఏర్పాటుకు తెరలెచింద‌నే సంకేతాల‌కు బ‌ల‌మిస్తోంది!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర స‌మ‌యం ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌నే ప్ర‌చారం కూడా ఊపందుకుంది. అందుకే అన్ని పార్టీలు ఇప్ప‌టినుంచే స‌మ‌ర శంఖాన్ని పూరించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో.. ఎల‌క్ష‌న్ హీట్ జోరందుకుంది. ఇక తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. ముఖ్యంగా అన్ని వ‌ర్గాలకూ టీఆర్ఎస్‌ను చేరువ చేసేలా సీఎం కేసీఆర్ వ‌రుస‌గా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నారు. నానాటికీ బ‌లం పుంజుకుంటోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌మ‌నిస్తే.. మ‌హా కూట‌మి ఏర్పాటు దిశ‌గా ఒక్కో అడుగూ ప‌డుతోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ అన్నీ ఒక్క తాటిపైకి వ‌స్తున్నాయని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఒక్కో ప‌రిణామం, మ‌హా కూట‌మి ఏర్పాటు దిశ‌లోనే ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ చాలా అంశాల‌పై ఒంట‌రిగానే తెరాస స‌ర్కారుతో పోరాటం చేస్తోంది. కొన్ని విష‌యాల్లో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడా తీసుకుంటోంది. నేరేళ్ల బాధితుల విష‌యంలో ఈ మ‌ధ్య ఇత‌ర పార్టీల సాయం తీసుకుంది. జీవో 39 విష‌యంలో కూడా టీడీపీతోపాటు వామప‌క్షాల‌ను కూడా కాంగ్రెస్ క‌లుపుకుని ముందుకు వెళ్లింది. ఇక‌, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ప‌నిచేయాల‌నే ఆలోచ‌న చాలా రోజుల‌ కింద‌టే తెర మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్ తో క‌లిసి పోరాటం చేయ‌డంలో త‌ప్పేముందంటూ రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు.

ఇక భాజ‌పా విష‌యానికొస్తే.. టీడీపీతో పొత్తు ఉంటుందో లేదో అనే క్లారిటీ ఇరు పార్టీల‌కూ లేదు. అయినా స‌రే, భాజ‌పా కూడా కాంగ్రెస్ తో క‌లిసి ఇటీవ‌ల కొన్ని అంశాల విష‌యంలో తెరాస‌పై పోరాటం చేస్తోంది. ఇక‌, జేఏసీ విష‌యానికొస్తే.. ఇన్నాళ్లూ త‌మ‌దొక సొంత అజెండా అన్న‌ట్టుగా కోదండ‌రామ్ ఉండేవారు. ఇప్పుడు ఆ పంథాను మార్చుకున్నారు. రాజ‌కీయ పార్టీల‌ను క‌లుపుకుని వెళ్తూ పోరాటాలు సాగిస్తున్నారు. ఇత‌ర ప‌క్షాలు కూడా జేయేసీ ఏర్పాటు చేస్తున్న మీటింగుల‌కు వెళ్తున్నాయి. ప్ర‌స్తుతానికి అన్ని పార్టీల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డంతో మ‌రి కొద్ది రోజుల్లో మ‌హా కూట‌మికి ఒక రూపు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!!