మ‌హేష్ ఫ్యాన్స్‌లో అయోమ‌యం..అంతా అయోమ‌యం!

ప్ర‌స్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజ‌యంపై ధీమాగా ఉన్నాయి. అదేస‌మ‌యంలో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేత‌లు ముందుకు పోతున్నారు.  త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్య‌మైన‌న్ని హామీలు.. అంత‌కు మించి సాధ్య‌మైన‌న్ని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక‌వైపు ముచ్చ‌ట‌. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వ‌చ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌రింత బ‌లంగా త‌మ‌వైపు తిప్ప‌గ‌ల వారికోసం ఇరు ప‌క్షాలూ దృష్టి సారించాయి. 

ఈ క్ర‌మంలోనే టీడీపీకి నంద‌మూరి బాల‌య్య దొరికాడు. చంద్ర‌బాబుకు స్వ‌యంగా వియ్యంకుడు కావ‌డంతో బాల‌య్య‌.. నేరుగా ప్ర‌చారం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. బుధ‌వారం ఆయ‌న త‌న సినీ డైలాగుల‌తో ప్ర‌చారం ప్రారంభించి హోరెత్తించేశాడు కూడా. ఇక‌, వైసీపీకి ఎవ‌రు ఇలాంటి వాళ్లు దొరుకుతారు? అని ఆలోచిస్తున్న స‌మ‌యంలోనే సూప‌ర్ స్టార్ కృష్ణ సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు రంగంలోకి దిగిపోయారు.  మ‌హేష్ బాబు వైసీపీ అండ‌గా ఉండ‌నున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. అంతేకాదు, మ‌హేష్ అభిమానులు అంద‌రూ రంగంలోకి దిగిపోయి.. ప్ర‌చారం హోరెత్తించాల‌ని పిలుపు కూడా ఇచ్చారు శేష‌గిరిరావు.

అయితే, ఇక్క‌డే అస‌లు తిర‌కాసు  బ‌య‌ట‌ప‌డింది. ఘ‌ట్ట‌మ‌నేని వంశం కాంగ్రెస్‌కి ఫేవ‌ర్‌. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉండ‌గా.. కృష్ణ ఆయ‌న‌తో అనేక విష‌యాల్లో క‌లిశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ను వైఎస్ వాడుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి సంబంధం ఏర్ప‌డింది. అయితే, వైఎస్ మ‌ర‌ణంతో ఘ‌ట్ట‌మ‌నేని వంశం ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ వైపు మ‌ళ్లుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అనుకున్న‌ట్టుగానే మ‌ళ్లినా.. ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు త‌ప్ప మిగిలిన వాళ్లు మాత్రం తెర‌వెనుకే ఉండిపోయారు. అంతేకాదు, 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన గ‌ల్లా అరుణ కుమారి, ఆమె త‌నయుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌ల‌ప‌క్షాన ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం నిల‌బ‌డింది. 

గ‌ల్లా జ‌య‌దేవ్‌కి ఓటేసి గెల‌పించాల‌ని అప్ప‌ట్లో మ‌హేష్ పిలుపు కూడా ఇచ్చారు. దీంతో అప్ప‌ట్లో క్లారిటీ వ‌చ్చేసింది. మ‌హేష్ టీడీపీకి మ‌ద్ద‌తిస్తున్నాడ‌ని అనుకున్నారు ఆయ‌న అభిమానులు అలా ఫాలో అయిపోయారు. అయితే, ఇప్పుడు ఆదిశేషగిరిరావు మాత్రం మ‌హేష్ త‌న మ‌ద్ద‌తు వైసీపీకి ఇస్తున్నార‌ని అంటున్నారు. అందుకే మ‌హేష్ అభిమానులు నంద్యాల‌లో ప్ర‌చారానికి దిగాల‌ని చెప్పారు. అయితే, దీనికి సంబంధించి ఘ‌ట్ట‌మ‌నేని ఇంటి నుంచి కానీ, మ‌హేష్ ఇంటి నుంచి కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.  

తాము వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్నామ‌ని వాళ్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. అయితే, అదేస‌మ‌యంలో శేష‌గిరిరావు గత వారం రోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ను సైతం వీరు ఖండించ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌హేష్ ఫ్యాన్స్‌లో ప్ర‌చారం విష‌యంపై సందేహం నెల‌కొంది. మ‌రి దీనిని తొల‌గించి క్లారిటీ ఇస్తే.. మంచిద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.