ఏపీ మంత్రికి గుబులు పుట్టిస్తున్న మావోల లేఖ‌

ఏపీ మంత్రుల‌కు మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మైనింగ్ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న వారి కొడుకుల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేయ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఏవోబీలో మావోయిస్టుల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్న త‌రుణంలో.. ఏపీ మంత్రి త‌న‌యుడిని హెచ్చరిస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌తంలో మంత్రికి కూడా హెచ్చ‌రిస్తూ లేఖ రాసిన మావోయిస్టులు.. ఇప్పుడు త‌న‌యుడిని బెదిరిస్తూ లేఖ రాయడం గుబులు పుట్టిస్తోంది. ఏపీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి త‌న‌యుడు విజ‌య్‌ను టార్గెట్ చేసుకోవ‌డం రాజకీయంగా ఆస‌క్తిరేపుతోంది.

విశాఖ జిల్లాలోని బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మావోయిస్టులు మద్దతుగా నిలుస్తున్నారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం సరుగుడు క్వారీ తవ్వకాలను గిరిజ‌నులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వీరికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు మావోయిస్టులు. మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి కొడుకు విజ‌య్‌ను ఉద్దేశిస్తూ ప్ర‌స్తుతం మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాస్ పేరిట విడుదలైన సదరు లేఖ ఇప్పుడు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అయ్య‌న్న‌ను హెచ్చరిస్తూ గతంలోనూ వీరు లేఖలు విడుదల చేసిన విష‌యం తెలిసిందే! ఈ ఘటనను మరువకముందే… ఆయ‌న త‌న‌యుడిని వ్యక్తిని టార్గెట్ గా చేసుకున్నారు.

స‌రుగుడు క్వారీ త‌వ్వ‌కాల్లో విజయ్‌కు వాటాలు ఉన్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఈ తవ్వకాలను గిరిజనులతో పాటు మావోయిస్టు పార్టీ కూడా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఆ ప్రాంతానికి చెందిన ఆదీవాసీల్లోనే కొందరు వ్యక్తులను బినామీలుగా చేసుకుని విజయ్ అండ్ కో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ అక్రమాలను ప్రశ్నించిన ఓ విలేకరిని చంపేస్తామంటూ విజయ్ అనుచరులు అబ్బాయిరెడ్డి – శ్రీను బెదిరించారట. ఇకపై వీరిద్దరూ తమ పద్దతులను మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కైలాసం హెచ్చరికలు జారీ చేశారు.

సరుగుడులోనే కాకుండా రాజపాకలు క్వారీని కూడా తక్షణమే తవ్వకాలను నిలిపివేయాలని తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించుకుంటారని కైలాసం పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు విశాఖ జిల్లా సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెను సంచలనంగా మారింది.

ఇప్పటికే ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు – ఆ జిల్లాలకు ఆనుకుని ఉన్న ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏవోబీలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మందికి పైగా మావోయిస్టులు చనిపోయిన త‌ర్వాత తిరిగి పుంజుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది!