బీజేపీలోకి చిరు.. ఏపీలో పొలిటిక‌ల్  తుఫాన్‌?

మెగాస్టార్ చిరంజీవి పార్టీ మార‌బోతున్నారా? ఆయ‌న‌ను బీజేపీ దువ్వుతోందా? ఏపీలో 2019లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల బాధ్య‌త‌ను సైతం ఆయ‌న‌కు అప్ప‌గించాల‌ని హైక‌మాండ్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయా? రాబోయే కొద్ది రోజుల్లోనే చిరు కాషాయ ద‌ళంలో చేర‌డం ఖాయ‌మా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది బీజేపీ నేత‌ల నుంచి! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌జారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన చిరు.. త‌ర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసి.. ఏకంగా రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్లు కేంద్ర మంత్రిగా చ‌క్రం త‌ప్పారు. ఇక‌, మ‌రో కొన్నాళ్ల‌లో ఈ రాజ్య‌స‌భ స‌మ‌యం అయిపోనుంది.

ఇక‌, చిరు పాలిటిక్స్‌లో ఏమ‌న్నాయాక్టివ్‌గా ఉన్నారా.. అంటే చెప్ప‌డం చాలా తేలిక‌. త‌న ప‌నేదో తాను చూసుకోవ‌డం మిన‌హా చిరంజీవి కాంగ్రెస్ కు ప్ర‌త్యేకంగా చేసింది ఏమీ లేదు. అంతేకాదు, చిరంజీవి పార్టీ మారిపోతారంటూ ఆ మ‌ధ్య పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా సాగింది. అదే స‌మ‌యంలో సొంత సోద‌రుడు ప‌వ‌న్ పెట్టిన జ‌న‌సేనలోని వెళ్తార‌ని ప్ర‌చారం సాగింది. అయితే, అనూహ్యంగా చిరు తిరిగి మూవీల్లోకి వెళ్లిపోయారు. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌లు సిద్ధ ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ.. ఇప్పుడు చిరు వైపు దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా ఏపీ నుంచి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య‌నాయుడు వెళ్లిపోతున్న నేప‌థ్యంలో బీజేపీకి బ‌ల‌మైన నేత అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఇక‌, ఏపీలో 2019 నాటికి రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా మారిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అంటే, చంద్ర‌బాబుతో బీజేపీ దోస్తీ క‌ట్ అయ్యే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వ‌తున్నారు. ఇక‌, ఏపీలో మూడు జిల్లాల్లో కాపులు ఉద్య‌మిస్తున్నారు. వీరికి త‌గిన హామీ ఇవ్వందే ఎన్నిక‌ల్లో గెలుపు సాధ్యం కాని పరిస్థితి మంజునాథ క‌మిష‌న్ వ‌చ్చినా కాపుల‌కు న్యాయం జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఈ స‌మ‌యంలో కాపుల ప‌క్షాన నిల‌బ‌డి వారిని ఓదార్చేవారికే ఓట్లు ప‌డ‌తాయ‌న‌డంలో సందేహం లేదు.

ఈ క్ర‌మంలో బీజేపీ ఇప్ప‌టికే ఏపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజును నిలబెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. అదేస‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన చిరును పార్టీలోకి తీసుకుని, రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా కాపుల‌కు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంద‌నే సూచ‌న‌ల‌ను ఆ వ‌ర్గానికి చేరువ చేయ‌వ‌చ్చ‌ని త‌ద్వారా బీజేపీ విస్త‌రించాల‌ని యోచిస్తోంది. ఇదే జ‌రిగితే.. ఏపీలో పొలిటిక‌ల్‌గా పెను తుఫాను ఖాయం అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.