ఆ ప్ర‌చార‌మే ఎంఐఎం కొంప‌ముంచుతోందా..?

రాజ‌కీయాల్లో అస‌ద్దుద్దీన్ సోద‌రులు అంటే అంద‌రికీ హ‌డ‌లే! అటు అసెంబ్లీ, ఇటు పార్ల‌మెంటు స‌మావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్ప‌డానికి కొంత ఆలోచించాల్సిందే! త‌మ వాగ్దాటితో అంద‌రినీ హ‌డ‌ల‌గొడుతుంటారు ఈ సోద‌రులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్క‌డుంటే అక్క‌డ‌.. పోటీ చేసి ఎంఐఎం స‌త్తా చాటాల‌ని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంప‌ముంచుతోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమ‌డ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో క‌లిసిపోయార‌నే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయ‌కుల్లో ఇది బ‌లంగా నాటుకుపోవ‌డంతో.. ఏం చేయాలో తెలియ‌క టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని చెప్పాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

మైనారిటీ కార్డుతో దేశంలో ఎక్క‌డైనా త‌మ హ‌వా న‌డుస్తుంద‌న్న ఎంఐఎం ఆశ‌లు బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ మారిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. త‌మ‌కు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో పోటీచేసి ఓట్ల చీలిక‌కుక కార‌ణమ‌వుతోంద‌నే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటోంది. ముఖ్యంగా త‌మ‌కు తెలియ‌కుండానే బీజేపీకి ల‌బ్ధి చేకూరుస్తోంద‌నే ప్ర‌చారం బ‌లంగా వినిపిస్తోంది. దీనినే ఉత్త‌రాది పార్టీలు త‌మ ప్ర‌చార అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ.. ప్ర‌ధాని మోడీతో చేతులు క‌లిపార‌ని బ‌లంగా నొక్కి చెబుతున్నాయి.

ఈ అనుమానాలు పార్టీ శ్రేణుల్లో మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. ఇది వ‌ర‌కు దారుస్స‌లాంకి భారీ సంఖ్య‌లో ద్వితీయ శ్రేణి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎక్కువ మంది వ‌చ్చేవారు. కానీ ఇప్పుడు వీరిసంఖ్య దాదాపుగా త‌గ్గిపోయింది. దీంతో అస‌దుద్దీన్‌లో తీవ్ర క‌ల‌వరం మొద‌లైంది. వెంట‌నే నష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కుఓవైసీ సోద‌రులు రంగంలోకి దిగారు. హ‌డావుడిగా దారుస్స‌లాంలో హ‌డావుడిగా ఒక భారీ స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. తాము అస్స‌లు బీజేపీతో చేతులు క‌లప‌లేద‌ని శ్రేణుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నంచేశారు. ఇదంతా కేవ‌లం దుష్ఫ్ర‌చార‌మేన‌ని గొంతు చించుకున్నారు. కానీ దీనిని క్యాడ‌ర్ మాత్రం న‌మ్మ‌లేద‌ట‌.

ఈ ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు ఇక వ‌రుస‌గా బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించాల‌నే నిర్ణ‌యానికి అస‌ద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఉప ప్రాంతీయ పార్టీగా పేరుపొందిన ఎంఐఎం.. ఇప్పుడిప్పుడే ఇత‌ర ప్రాంతాల‌కూ విస్త‌రిస్తోంది. ఇటువంటి స‌మ‌యంలో ఈ త‌ప్పుడు ప్ర‌చారం వ‌ల్ల పార్టీ ఉనికి కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నాయ‌ట. ముఖ్యం గా పార్టీ భ‌విష్య‌త్తుపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని నేత‌లు స్ప‌ష్టంచేస్తున్నారు. మ‌రి ఎంఐఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచిచూద్దాం!