ఐదోసారి నియోజ‌క‌వ‌ర్గం మారుతోన్న గంటా..!

చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుకు రాజ‌కీయ ఊస‌రవెల్లి అనే బిరుదు నూటికి నూరుశాతం వ‌ర్తిస్తుంది అన‌డంలో సందేహ‌మే లేదు. ఆయ‌న‌కు రాజ‌కీయాల్లో పార్టీ, నైతిక విలువ‌లు ఏ కోశాన ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌వు. ఆయ‌న‌కు కావాల్సింది ప‌ద‌వీ, డ‌బ్బే అన్న‌చందంగా ఆయ‌న రాజ‌కీయం చేస్తున్నారు. గంటా శ్రీనివాస‌రావు గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో చూసుకుంటే టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా అన్ని పార్టీలు మారారు. ఒక్క వైసీపీలోకే ఆయ‌న వెళ్ల‌లేదు.

ఇక రాజ‌కీయంగా గంటా గ‌త నాలుగు ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మారారు. ఆయ‌న ఈ నాలుగు సార్లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తే ప్ర‌జావ్య‌తిరేక‌త‌తో ఖ‌చ్చితంగా ఓడిపోయేవారు. కానీ చాలా తెలివిగా గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోను ఒక్కోసారి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తూ గెలిచిపోతున్నారు. 1999లో అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన ఆయ‌న 2004లో చోడ‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

2009లో ప్ర‌జారాజ్యంలోకి జంప్ చేసిన గంటా ఈ సారి అన‌కాప‌ల్లికి మారారు. అక్క‌డ నుంచి గెలిచి ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అన‌కాప‌ల్లిలో గంటాకు వ్య‌తిరేక‌త పెర‌గ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు ఆయ‌న భీమిలికి మారి టీడీపీ వేవ్‌లో గెలిచి మ‌రోసారి మంత్రి ప‌ద‌వి అయ్యారు.

తాజాగా విశాఖ భూకుంభ‌కోణం భవిష్యత్‌లో పార్టీకి, త‌న‌కు తీరని నష్టం క‌లిగిస్తోంద‌ని భావిస్తోన్న గంటా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరో కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి ఆయ‌న ఏకంగా జిల్లానే మారిపోతున్నారు. ప‌క్క‌నే ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల నుంచి గంటా 2019లో పోటీకి రెడీ అవుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియ‌ర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు వృద్ధాప్యం కారణంగా ఆయనను తప్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్ర‌మంలోనే ఈ సీటుపై గంటా క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి గంటా మాట ఈ సారి చంద్ర‌బాబు వ‌ద్ద ఎంత వ‌ర‌కు చెల్లుబాటు అవుతుందో చూడాలి.