మిష‌న్‌-175 సాధ్య‌మేనా బాబు?

ఆశ‌.. అత్యాశ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి రావాల‌నుకుంటారు.. ఇది స‌హ‌జ‌మే! అధికారంలోకి రావాల‌నుకోవ‌డం ఒక ఎత్త‌యితే.. మొత్తం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తామే గెల‌వాల‌నుకోవ‌డం మాత్రం అత్యాశే అవుతుంది. ఇది విన‌డానికి కూడా కొంత కామెడీగానే ఉంటుంది. ఈ లెక్క‌లు వింటే కొంత ఆశ్చ‌ర్యం కూడా క‌లుగుతుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు లెక్క‌లు విన్నా ఇలాంటి అభిప్రాయ‌మే క‌లుగుతుంది. 2019 ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని ధీమాగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మిష‌న్-175 అంటూ శ్రేణుల‌కు కొత్త టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో విజ‌యం.. దానిని కొన‌సాగిస్తూ కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ జెండా రెప‌రెప‌లు..దీంతో టీడీపీ మంచి జోష్ మీదుంది. మరోవైపు చంద్రబాబు ముందస్తు ఎన్నికల జపం చేస్తుండడంతో కేడర్ లో ఎలక్షన్ ఫీవర్ పెరిగిపోతోంది. శాశ్వత అధికారమే లక్ష్యంగా టీడీపీ మొదలుపెట్టిన యాక్షన్ ప్లాన్ తో ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 డిసెంబరులోనే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయనుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నంద్యాల, కాకినాడ ఎన్నికల స్ఫూర్తి వచ్చే ఎన్నికల్లో కూడా కనిపించాలని శ్రేణుల‌కు చంద్ర‌బాబు చెబుతున్నారు. అదే స్ఫూర్తితో పనిచేస్తే 175 స్థానాలు గెలవడం సాధ్యమేననేది ఆయన ఆకాంక్ష. వంద శాతం సీట్లూ తమకే రావాలనడం చంద్రబాబు అత్యాశకు నిదర్శనమనేది విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఎన్నికలతో ఏపీలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి నేతలు టీడీపీలో చేరతారని.. తద్వారా వైసీపీ పనైపోతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే జరిగితే నూటికి నూరుశాతం సీట్లు సాధించడం అసాధ్యమేమీ కాదంటున్నాయి.

ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి ఒకటో రెండో సీట్లు వచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది టీడీపీ నేతల మాట.ఇకపై ఎంపీలు, ఎమ్మెల్యేలంతా 24 గంటలూ ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు స్పష్టంచేశారు. 175 స్థానాల్లో గెలవడానికి ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీని 20 క్లస్టర్లుగా విభజించనుంది టీడీపీ. అంటే 175 నియోజకవర్గాల్లో 3500 మంది క్లస్టర్‌ ఇన్‌ఛార్జులను నియమించబోతోంది. ప్ర‌ణాళిక ఎలా ఉన్నా.. ప్ర‌తిప‌క్షానికి అంతో ఇంతో బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయి క‌దా అనేది విశ్లేష‌కుల అభిప్రాయం!!