బీజేపీ ముందు రెండు ఆప్ష‌న్స్.. రెండోదే సెలెక్ట్‌

May 16, 2018 at 2:19 pm
modi-amith shah

ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని ప్ర‌ధాని మోదీ, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా పావులు క‌దుపుతూనే ఉన్నారు. చివ‌రికి ఆ స్వ‌ప్నం సాకార‌మ‌య్యే అవ‌కాశం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల రూపంలో వ‌చ్చింది. కానీ క‌ల పూర్త‌వ‌కుండానే మేల్కొన్నట్లు.. అధికారానికి ఎనిమిది సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. మ‌రి ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రంలో కాషాయ జెండా రెప‌రెప‌లాడించాల‌నే స్వ‌ప్నాన్ని సాకారం చేసుకోవాలంటే మోదీ-షా ముందున్న మార్గాలేమిటనే అంశం తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఇందులో విలువ‌లు పాటించి అధికారాన్ని కాంగ్రెస్‌-జేడీఎస్ చేతుల్లో పెడ‌తారా?  లేక విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి రాజ‌కీయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటారా? అనే ప్రశ్న‌లు వినిపిస్తున్నాయి. అయితే వీరి జోడీ గురించి తెలిసిన వారంతా ఒక్క విష‌యాన్నే స్ప‌ష్టంచేస్తున్నారు. అదే రెండో ఆప్ష‌న్‌!! 

 

చేప చిక్కిన‌ట్టే చిక్కి మ‌ళ్లీ నీటిలో ప‌డిపోతే ఎలా ఉంటుందో.. విలువైన బ్యాగ్ దొరికిన‌ట్టే దొరికి మాయ‌మైతే ఎలా ఉంటుందో.. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇటువంటి చాన్సు కోసం ప్ర‌య‌త్ని స్తుంటే.. అధికారం చిక్కిన‌ట్టే చిక్కి మ‌ళ్లీ మ‌టుమాయ‌మైంది. త‌మ‌కే అధికారం వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్న క‌మల నాథులు క‌ల‌లు క‌ల్ల‌లైపోయాయి.  103 సీట్లు సాధించి అధికారానికి కేవ‌లం 8 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. ఇప్పుడు బీజేపీ చేసేదేమిటి అంటే.. ఒకటి.. కాంగ్రెస్ ను చీల్చటం లేదా జేడీఎస్ ను రెండు ముక్కలు చేయటం. ఈ రెండింటిలో ఏం చేసినా అపకీర్తిని మూటకట్టుకోవటం ఖాయం. సిద్ధాంతాలు.. ప్రమాణాలు అంటూ చేతికి వచ్చిన పవర్ ను సైతం త్యాగం చేసిన బీజేపీ నేతల్లా తాము కాద‌న్న‌ది మోదీ, షా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.  

 

కర్ణాటక తుది ఫ‌లితాల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పవర్ ను చేపట్టే సీట్లు ప్రజలు ఆ పార్టీకి ఇవ్వలేదు. అయితే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ముందు రోజే కాంగ్రెస్ అధినాయకత్వం తన దూతల్ని బెంగళూరుకు పంపడంతో ముందుగానే ఫ‌లితాలు అంచ‌నా వేసింద‌ని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరిస్తే.. ఓవర్ కాన్ఫిడెన్స్ లో కమలనాథులు మాత్రం.. కర్ణాటకలో అప్రమత్తంగా ఉండ‌లేక‌పోయారు. కాంగ్రెస్ వాయు వేగంతో పావులు కదుపుతూ.. రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుంటే..  బీజేపీ మాత్రం ఫ‌లితాలు అంచ‌నా వేయ‌డంలో విఫ‌ల‌మైంది. సాయంత్రం అమిత్ షా బెంగళూరుకు చేరుకున్నారంటే ఆ పార్టీ తప్పు ఏమిటో ఇట్టే చెప్పక తప్పదు.

 

కర్ణాటక రాజకీయం ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరగనుంది? అన్నది చూస్తే.. కాసిన్ని విమర్శలు వెల్లువెత్తినా కర్ణాటకలో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కోరే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మోదీ, షాలు లాంటి మాస్టర్లు ఉండి.. మెజార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే తగ్గినప్పుడు కూడా పవర్ ను పక్కనోళ్ల చేతుల్లో పెట్టటం అంటే వారి సమర్థత మీద పార్టీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. అందుకే నలుగురు వేలెత్తి చూపినా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే బీజేపీ వ్యవహరిస్తుందని చెప్పాలి. ఒకవేళ జేడీఎస్-కాంగ్రెస్   కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. బీజేపీ గెలిచి మరీ ఘోరంగా ఓడినట్లే అవుతుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. 

బీజేపీ ముందు రెండు ఆప్ష‌న్స్.. రెండోదే సెలెక్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share