ఏపీలో మోడీ బొమ్మ వ‌ర్సెస్ బాబు బొమ్మ‌

September 17, 2017 at 6:32 am
Modi, chandra babu, somu veeraju, BJP

సోము వీర్రాజు! ఏడాదిన్న‌ర‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్ర‌పక్షం నేత‌. టీడీపీ-బీజేపీల మిత్ర‌ప‌క్షాలే అయిన‌ప్ప‌టికీ.. సోము ఆవేశం, ఆవేద‌న మాత్రం.. విప‌క్షం మాదిరిగానే ఉంటోంది. త‌మ‌ను టీడీపీ అధినేత క‌రివేపాకులా చూస్తున్నార‌ని, త‌మ‌కు విలువ లేద‌ని, ఆయ‌న‌కు చెక్క‌భ‌జ‌న చేసేవాళ్ల‌నే ప‌ట్టించుకుంటున్నాడ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగిన సోము.. అస‌లు టీడీపీతో బంధం వ‌ద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖ‌లు రాసి, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు సైతం ఇప్పించాడు. దీనికి కార‌ణం పైన చెప్పుకొన్న‌ట్టు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఒక్క‌టే కార‌ణం కాదు.

మిత్ర‌ప‌క్షంగా అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఓ ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తే స‌రా? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు సైతం బీజేపీ నేత‌ల‌కు ఇవ్వ‌డం లేద‌ని, అంతేకాకుండా బీజేపీని రాష్ట్రంలో ఎద‌గ‌కుండా బాబు అడ్డుపుల్ల వేస్తున్నార‌ని, బీజేపీపై బాబుది స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ని అనేక సంద‌ర్భాల్లో సోము విరుచుకుప‌డ్డారు. నిజానికి వీటిని బీజేపీ అధిష్టానం కూడా న‌మ్మింది. కొన్ని సంద‌ర్భాల్లో బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని కూడా వార్త‌లు రావ‌డంతో స‌రేకాబోలు అనుకుని, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి ద‌గ్గ‌ర‌య్యేందుకు య‌త్నించింది. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప పోరు, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ సైకిల్ జోరు కొన‌సాగింది.

దీంతో బీజేపీ అధిష్టానం వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లోనూ టీడీపీతోనే పొత్తు ఉంటుంద‌ని ఖరాఖండీగా చెప్పింది. దీంతో విధిలేని ప‌రిస్థితిలో బీజేపీలోని టీడీపీ విమ‌ర్శ‌కులు నోళ్లు మూసుకున్నారు. అయినా.. కూడా సోము మాత్రం ఆగ‌లేదు. ఇప్పుడు తాజాగా మ‌రో విష‌యంతో అధికార పార్టీని ఏకేస్తున్నాడు.

కేంద్ర నిధుల‌తో రాష్ట్రం చేప‌ట్టే ప‌థ‌కాలకు సంబంధించిన ఫ్లెక్సీల్లో ప్ర‌ధాని మోదీ ఫొటో కూడా పెట్టాల‌ని సోము వీర్రాజు తాజా డిమాండ్ లేవ‌నెత్తారు. ఈమేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆయన లేఖ కూడా రాశారు. ప్ర‌ధాని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌చ్ఛ‌తే సేవ ప‌థ‌కం ఫ్లెక్సీల్లో మోదీ బొమ్మ లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మని మండిప‌డ్డారు. ఏపీలో గ‌తంలో కూడా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టిన ప‌థ‌కాల్లో ప్ర‌ధాని బొమ్మ లేక‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. దీంతో సోము శైలి.. `టీడీపీని వ‌ద‌ల బొమ్మాళి వ‌ద‌ల` అంటున్న‌ట్టు ఉంద‌ని త‌మ్ముళ్లు భావిస్తున్నారు. మ‌రి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

ఏపీలో మోడీ బొమ్మ వ‌ర్సెస్ బాబు బొమ్మ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share