ఏపీని కేంద్రం ముంచేస్తోందా?

రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే.. స‌మాఖ్య వ్య‌వ‌స్థ బాగుండాలి! అంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్రంలో ఒక ప్ర‌భుత్వం, రాష్ట్రంలో మ‌రో పార్టీ ప్ర‌భుత్వం ఉంటే ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫ‌లితంగా రాష్ట్ర అభివృద్ధి నానాటికీ తీసిక‌ట్టుగానే మారుతుంది. అదే, కేంద్రం, రాష్ట్రాల్లో ఏక పార్టీ ప్ర‌భుత్వం ఉంటే.. చాలా బెట‌ర్‌. అవ‌స‌రానికి కేంద్రం నిధులివ్వ‌డ‌మే కాకుండా.. అన్ని విష‌యాల్లోనూ వెనుకేసుకు వ‌స్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన యూపీ చిన్నారుల మృతులు, హ‌రియాణాలో డేరా బాబా అనుచ‌రుల విధ్వంసం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైతుల‌పై కాల్పులు దీనికి ఉదాహ‌ర‌ణ‌. ఇక్క‌డ కేంద్రంలోని బీజేపీనే పాలిస్తోంది కాబ‌ట్టి ఈ విష‌యాలు చాలా తేలిక‌గా,తొంద‌ర‌గా తెర‌మ‌రుగ‌య్యాయి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ బీజేపీ-టీడీపీ మిత్ర ప‌క్ష ప్ర‌భుత్వం న‌డుస్తోంది. అయినా కూడా కేంద్రం ఏపీపై శీత‌క‌న్నేస్తోంది. వివిధ ప్రాజెక్టుల‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను స‌కాలంలో ఇవ్వ‌డం లేదు. పైగా అన్ని విష‌యాల్లోనూ కొర్రీలు పెడుతోంది. నిజానికి 2014 కు ముందు ఒప్పందం ప్ర‌కారం బాబు.. బీజేపీకి చెందిన ఇద్ద‌రికి మంత్రి ప‌దవులు ఇచ్చి ఒక‌రికి కేబినెట్ హోదా క‌ట్ట‌బెట్టారు. అయినా కూడా కేంద్రం ఏపీని పూచిక‌పుల్ల‌తో స‌మానంగా చూస్తోంది. దీనికి కార‌ణం ప‌క్క‌న పెడితే.. కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఏపీ నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఆర్థికంగా అస‌లే లోటు బ‌డ్జెట్‌, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్ వంటి వి రాష్ట్రాన్ని నిలువునా ఇబ్బంది పెడుతున్నాయి.

ఆదుకోవాల్సిన కేంద్రం కూడా నిధుల విష‌యంలో ఏపీకి మొండి చేయి చూపుతుండ‌డంతో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రూ. 21,400 కోట్లు రావాల్సి ఉండగా మొదటి మూడు నెలల్లో వచ్చింది కేవలం రూ. 725 కోట్లు మాత్రమే. ఈ నిధులు కుడా కేంద్ర పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో వచ్చినవే. రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు, పోలవరానికి రూ. 7 వేల కోట్లు, ఉపాధిహామీ పథకానికి రూ. 6340 కోట్లు రావాలి. అయితే, ఇంత వరకూ అడ్రస్ లేదు.

పోయిన ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుండి రావాల్సిన దానికన్నా రూ. 4002 కోట్లు తక్కువచ్చాయి. రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరం, కేంద్ర సహాయ ప్రాజెక్టులు, నరేగా తదితరాలకు రూ. 11,910 కోట్లు రావాల్సుండగా వచ్చిది రూ. 7908 కోట్లు మాత్రమే. రాజధాని కోసం రూ. వెయ్యి కోట్లు కావాలని రాష్ట్రం కోరగా కేంద్రం ఇచ్చింది రూ. 450 కోట్లు మాత్రమే. దీంతో ఏపీ ఏవిధంగా ముందుకు వెళ్తుందో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే చెప్పాల‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మేకిన్ ఇండియాలో భాగంగానైనా మేకిన్ ఏపీ చేయాల‌ని వారు కోరుతున్నా… ప‌ట్టించుకునే నాథుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.