మోడీ అస‌లు రూపం..ఇప్పుడే బయటపడిందా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అస‌లు రూపం బ‌ట్ట‌బ‌య‌లైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆయ‌న గ‌డ్డి ప‌ర‌క‌లా ప‌క్క‌న పెట్టేశారు. ప‌ట్టుమ‌ని మూడేళ్లు కూడా తిర‌గ‌కుండానే.. ఒకే వేదిక‌ను పంచుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన నేత‌ను నిలువునా అవ‌మానించారు. అసలు ఏపీలో ప‌వ‌న్ అనే వ్య‌క్తి ఉన్నాడ‌న్న త‌లంపు కూడా లేకుండా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్య‌క్ర‌మం జోరుగా సాగుతోంది. అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి వ‌ర‌కు ఇది కొన‌సాగ‌నుంది.

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, మ‌రుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిపై ప్ర‌ధాని మోడీ, కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టాయి. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స‌హా ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిలో భాగ‌స్వామ్య మ‌య్యారు. ఇదే క్ర‌మంలో దేశంలోని వీవీఐపీలు, ప్ర‌ముఖులు, ఫిలం ఇండ‌స్ట్రీకి చెందిన వారిని కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఇన్వాల్వ్ చేయాల‌ని మోడీ సంక‌ల్పించారు. దీనిగాను ఆయ‌న పేరుపేరునా అంద‌రికీ లేఖ‌లు రాశారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని ప్ర‌ముఖ న‌టులు, హీరోల‌కు కూడా ప్ర‌ధాని లేఖ‌లు అందాయి. మీరంతా ఈ స్వ‌చ్ఛ‌తే సేవ‌లో పాల్గొనాల‌ని ప్ర‌ధాని స్వ‌యంగా వారికి విజ్ఞ‌ప్తి చేశారు.

సినీ నటులు మహేష్‌బాబు., బాహుబ‌లి ప్రభాస్‌, రానా, కృష్ణంరాజు, మోహ‌న్‌బాబు, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వంటి వారికి ప్రధాని నుంచి మోదీ లేఖలు అందాయి. దీంతో వీరంతా చీపురు, చాటా ప‌ట్టుకునేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, 2014తో త‌మ‌తో క‌లిసి జ‌నాల్లోతిరిగి, బీజేపీ-టీడీపీ కూట‌మికి ఓట్లేయాల‌ని పిలుపునిచ్చి ప్ర‌చారం చేసిన జ‌న‌సేన‌ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మాత్రం ప్ర‌ధాని ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న నుంచి జ‌న‌సేనానికి ఎలాంటి పిలుపూ రాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోవడం మానేశారని ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ప్ర‌స్తుత వైఖ‌రి బ‌లాన్నిచ్చింది.

కార‌ణాలు ఇవేనా?

+ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేది లేదని స్పష్టమయ్యాక పవన్‌ వైఖరిలో మోడీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు.

+ రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని., వాటికంటే బందరు లడ్డూలు., తాపేశ్వరం కాజాలు బాగుంటాయని ఎద్దేవా చేశారు.

+ ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసం జనసేన శ్రేణులు రోడ్డు ఎక్కడానికి పవన్‌ మద్దతు ప్రకటించారు.

+ మోడీ ప్రియ మిత్రుడు ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌పై ప‌వ‌న్ భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

+ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌యంగా త‌మ పార్టీ పోటీకి దిగుతోంద‌ని వెల్ల‌డించారు.

+ ఈ కార‌ణాల నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌ను మోడీ ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు.