ఆ పొలిటిక‌ల్ సినిమాకు శుభం కార్డు

భార‌త దేశ రాజ‌కీయాలను నిశితంగా గ‌మ‌నిస్తే.. రెండు విష‌యాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి. దేశాన్ని పాలిస్తున్న‌ది రెండే రెండు జాతీయ పార్టీలు. ఒక‌టి కాంగ్రెస్ కాగా, రెండోది బీజేపీ. ఈ రెండు మిన‌హా దేశాన్ని పాలించిన పార్టీలు లేవ‌నే చెప్పాలి. అయితే, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా అవి వాటి అస్తిత్వం కోస‌మే పోరు చేయ‌డంలో టైం గ‌డిచి పోతోంది. దీంతో ఇక‌, భార‌త్ వంటి ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం దేశంలో కేవ‌లం రెండు పార్టీలేనా ప్ర‌జ‌ల‌ను పాలించేది? అందులోనూ ఒక‌టి గాంధీల వంశంగా పేరుబ‌డితే.. మ‌రోపార్టీ రాముడిని నెత్తిన పెట్టుకున్న మ‌త త‌త్వ పార్టీగా గుర్తింపు సాధించింది. అయితే, భార‌త్ మాత్రం భిన్న మ‌తాల‌, భిన్న సంప్ర‌దాయాల దేశం. అలాంటి దేశంలో ఈ రెండు త‌ప్ప ఇంకే పార్టీ దేశాన్ని పాలించ‌లేదా?!

ఇలాంటి ప్ర‌శ్న నుంచే 1977లో ఆవిర్భ‌వించింది జ‌న‌తా పార్టీ. అయితే, అది ప్ర‌జాభిమానాన్ని పూర్తిస్థాయిలో చూర‌గొన‌లేక‌పోయింది. దీంతో అన‌తికాలంలోనే కాల గ‌ర్బంలో క‌లిసి పోయింది. ఆ త‌ర్వాత ఇక‌, అలాంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు.కానీ, 2014లో మాత్రం తృతీయ కూట‌మి దిశ‌గా అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అంటే, దేశ‌వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప్రాంతీయ పార్టీల‌న్నీ .. క‌లిసి ఓ మ‌హా కూట‌మిగా ఏర్ప‌డి దేశంలో ప్ర‌త్యామ్యాయ రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించి.. ఢిల్లీలో కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అడుగులు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు దివంగ‌త‌ సీఎం జ‌య‌ల‌లిత‌, బిహార్‌లోని లాలూ ప్ర‌సాద్‌, నితీశ్ కుమార్‌, యూపీలోని ములాయం సింగ్ వంటి ఉద్ధండులు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ త‌న ప్ర‌ధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోడీని ప్ర‌క‌టించిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఈ మ‌హాకూట‌మి వ‌ర్గాలు చిందులేశాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ మోడీని ఢిల్లీ ద‌రిదాపుల్లోకి కూడా రానీయ కూడ‌ద‌ని ఒట్టు పెట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక‌టికి రెండు సార్లు భేటీఅయిన ఈ మ‌హాకూట‌మి వ‌ర్గాలు.. ప్ర‌ధాని ప‌ద‌వి విష‌యం వ‌చ్చే స‌రికి మాత్రం ఏకాభిప్రాయం సాధించ‌లేక‌పోయాయి. ఈ ప‌ద‌విపై ములాయం సింగ్ యాద‌వ్‌, జ‌య‌ల‌లిత‌, మ‌మ‌త‌లు క‌న్నేయ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. దీంతో 2014లోనే ఈ కూట‌మి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఆగిపోయింది.

ఇక‌, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక‌, ఇప్పుడు ఢిల్లీ స‌హా దేశంలోని గ‌ల్లీ గ‌ల్లీని త‌న మాట‌లు, చేత‌ల‌తో ప్ర‌భావితం చేస్తున్న ప్ర‌ధాని మోడీకి చెక్ చెప్పాల‌ని మ‌హాకూట‌మిలోని పార్టీలు నిర్ణ‌యించాయి. ముఖ్యంగా మ‌మ‌త అయితే, మ‌రీ ఎక్కువ‌గా మోడీని విమ‌ర్శించేవారు ఎలాంటి వారైనా జ‌త క‌ట్టి వంత పాడేందుకు రెడీ అని ప్ర‌క‌టించారు కూడా. ఈ నేప‌థ్యంలో బిహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్ ప్ర‌ధానంగా చ‌క్రం తిప్పుతార‌ని అంద‌రూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న మోడీ పంచ‌న చేరిపోయారు. క‌న్ను మూసి తెరిచే లోపు ఉరుములు లేని వ‌ర్షంలా బిహార్‌లో ప్ర‌భుత్వాన్ని మార్చేశారు. దీంతో ఇప్పుడు మ‌హాకూట‌మి అంశం మ‌రుగున ప‌డిపోయిందా? అనే మాట‌కు బ‌లం చేకూరింంది.

నిజానికి మ‌హాకూట‌మి వ‌స్తే.. మోడీ ప్ర‌భుత్వానికి ముప్పు అన్న‌ది కొంత మేర‌కు నిజ‌మే. అయితే, గ‌డిచిన అర్ధ శ‌తాబ్దం రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ద‌క్షిణాది రాజ‌కీయాలు ఉత్త‌రాదికి, ఉత్త‌రాది రాజ‌కీయాలు ద‌క్షిణాదికీ స‌రిప‌డడం లేదు. దీనిని గ‌మ‌నించే కాంగ్రెస్‌, బీజేపీలు ఎప్పుడూ.. మ‌హా కూట‌మి అంటే.. పెద్ద‌గా బెంబేలెత్తిన సంద‌ర్భాలు లేవు. ఈ ద‌ఫా కూడా అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, బిహార్‌లో లాలూ, నితీశ్ ద్వ‌యం ప‌ట్టు బ‌డితే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త త‌దిత‌రులు కూట‌మిగా ఏర్ప‌డి మోడీని ప‌క్క‌న పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు.

దీనిని గ్ర‌హించిన మోడీ.. అస‌లు కూట‌మే లేకుండా చేయాల‌నే దృక్ఫ‌థంతో నితీశ్‌ను తెలివిగా త‌న జ‌ట్టులోకి లాగేసుకున్నారు. ఫ‌లితంగా ఇప్పుడు దేశంలో మ‌హాకూట‌మి అని పేరు ఎత్తేవారు కూడా లేకుండా పోయారు. ఒక‌వేళ ఎత్తినా లాలూ లేని కూట‌మిని ఊహించ‌లేం. అలాగ‌ని లాలూతో జ‌త‌క‌డితే.. అవినీతి పంచ‌న చేరిన‌ట్టేన‌ని ప్ర‌చారం చేసుకునేందుకు మోడీ రెడీగా ఉన్నారు. సో.. ఎలా చూసినా.. ఇప్పుడు ఇక‌, మ‌హాకూట‌మి, మూడో కూట‌మి వంటి మాట‌ల‌కు కాలం తీరిపోయింది!!