టీడీపీలో బిగ్ వికెట్ డౌన్‌… బాబుకు పెద్ద షాకే

May 22, 2018 at 12:42 pm
mothukupally narasimhulu-kcr

టీటీడీపీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మొన్న‌టికి మొన్న తెలుగు రైతు రాష్ట్ర అధ్య‌క్షుడు ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డితోపాటు ఎర్ర‌బెల్లి అలుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. తాజాగా సీనియ‌ర్ నేత‌, పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు కూడా పార్టీని వీడి, గూలాబీ గూటికి చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ప‌దిప‌దిహేను రోజుల్లోనే ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకుంటార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. కొన్ని నెల‌లుగా మోత్క‌ప‌ల్లి పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

 

పార్టీ అధినేత చంద్ర‌బాబు తీరుతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. గ‌తంలో పార్టీ మ‌నుగ‌డ‌పై, చంద్ర‌బాబుపై మోత్కుప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మైపోయింద‌నీ, పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని, అప్పుడే అంద‌రికీ గౌర‌వప్ర‌దంగా ఉంటుంద‌నీ  గత మార్చి 18న మోత్కుపల్లి న‌ర‌సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేసి, పెద్ద దుమార‌మే లేపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను చంద్రబాబు దూరంగా పెట్టారు.  మోత్కుపల్లి లేకుండానే హైదరాబాద్‌లో చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. 

 

ఆ త‌ర్వాత కూడా మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీపీ బతికించుకోవడానికే తాను అలా అన్నాన‌నీ, ఎన్న‌డుకూడా పార్టీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇక అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న దూరంగానే ఉంటున్నారు.  నిజానికి సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవ‌డంలో మోత్కుప‌ల్లి ఎప్పుడూ ముందువ‌రుస‌లో ఉండేవారు.  భువనగిరిలో జరిగిన మినీమహానాడులో మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మోత్కుపల్లిని మినీ మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే  ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది. 

 

ఈ నేప‌థ్యంలోనే ఇక మోత్కుప‌ల్లి పార్టీ మార‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లోనే త‌న అనుచ‌రులతో చ‌ర్చించి, టీఆర్ఎస్ పార్టీలో చేరే విష‌యాన్ని ఖరారు చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గానే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానం నుంచి మోత్క‌ప‌ల్లిని పోటీ చేయించేందుకు గులాబా బాస్ సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

టీడీపీలో బిగ్ వికెట్ డౌన్‌… బాబుకు పెద్ద షాకే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share