మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు

February 9, 2017 at 12:27 pm
72

తెలంగాణ‌లో తిరుమ‌లలా ప్ర‌సిద్ధి చెందిన భ‌ద్రాద్రి జిల్లా సీతారామ‌చంద్ర‌మూర్తి ఆల‌యం(భ‌ద్రాద్రి ఆల‌యం) పాల‌నా ప‌గ్గాలు త్వ‌ర‌లోనే మై హోం వ్య‌వ‌స్థాప‌కుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు అంద‌నున్నాయ‌ట‌! ఆయ‌న‌ను చిన జీయ‌ర్ స్వామి సిఫార్సు చేశార‌ని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛ‌నంగా ఆమోదించార‌ని, త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు వెలువ‌డ నున్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా రంగు పులుము కుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఎంతో మందిని కాద‌ని రామేశ్వ‌ర‌రావుకు ఈ పోస్టు అప్ప‌గించ‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

జూపల్లి రామేశ్వరరావు సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. చినజీయ్యర్‌ స్వామికి ప్రియశిష్యుడు. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాలలో ప్రస్తుతం ఆయన పేరు బాగా వినబడుతోంది. ప్రస్తుతం ఆయన యాదాద్రి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.  అయితే, ఆయ‌న‌కు త్వ‌ర‌లోనే  భద్రాచలం ఆలయ పాలనా పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు కూడా ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనపై చర్చించే క్రమంలో సీఎం కేసీఆర్  సూచన మేరకు చినజీయ్యర్‌ స్వామి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భద్రాచలానికి విచ్చేశారు. ఈయ‌న‌తో పాటు  రామేశ్వరరావు కూడా వచ్చారు. ఈ ప‌రిణామం.. అంద‌రినీ ఆలోచ‌న‌లో ముంచెత్తింది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చినజీయ్యర్‌స్వామితోపాటు రామేశ్వరరావు సైతం భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, దేవస్థానం పండితులు, స్తపతులతో కలిసి భద్రాద్రి అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌ గురించి చర్చించారు. ఈ క్ర‌మంలోరామేశ్వరరావు కూడా సలహాలు, సూచనలు ఇచ్చారట.  ఇలా భ‌ద్రాద్రి విష‌యంలో రామేశ్వ‌ర‌రావు చురుగ్గానే ఉన్న‌ట్టు స‌మాచారం. దీనిని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్‌.. ఎప్ప‌టి నుంచో ఖాళీగా ఉంటున్న భ‌ద్రాద్రి పాల‌క మండ‌లిని తిరిగి ఏర్పాటు చేయాల‌ని, దానికి చైర్మ‌న్‌గా రామేశ్వ‌ర‌రావును నియ‌మించాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share