చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు

February 16, 2017 at 8:36 am
add_text

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్ర‌శ్న రాజ‌కీయాల్లో కొంత‌కాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌కు తెర‌పడింది. అన్న‌య్య, మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్ వైపు, త‌మ్ముడు, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన అంటూ త‌లోవైపు ఉండ‌టంతో ఎవ‌రిని సపోర్ట్ చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరంద‌రినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు త‌మ్ముడిగా ఉండే నాగ‌బాబు.. ఇప్పుడు త‌మ్ముడి చెంత‌కు చేర‌బోతున్నాడు. అలాగే త‌న‌తో మెగా ఫాన్య్ అంద‌రినీ జ‌న‌సేన వైపు న‌డిపేందుకు సంసిద్ధుడ‌వుతున్నాడు. అంతేగాక అన్న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపైనా క్లారిటీ ఇచ్చాడు.

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. తమ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. గ‌త ఎన్నిక‌ల్లో అన్న‌కు స‌పోర్ట్ చేసినా.. ఈ సారి మాత్రం త‌మ్ముడికే త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. అంతేగాక మెగా అభిమానులు కూడా జ‌న‌సేన అధినేత‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరాడు. తాను నిర్వ‌హిస్తున్న యూ ట్యూబ్ చానెల్ `మై ప‌ర్‌స్పెక్టివ్‌(నా దృక్కోణం)`ద్వారా ఈ విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. పెద్ద నోట్ల రద్దు పై మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆయ‌న అప్లోడ్ చేసిన వీడియో సంచ‌ల‌న‌మైంది. ఇప్పుడు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ గురించి వివ‌రిస్తూ మ‌రో వీడియోతో ముందుకొచ్చారు. పవన్ వ్యక్తిత్వం, రాజకీయ భవిష్యత్ పై ఇందులో అర‌గంట‌ మాట్లాడారు. ఆయ‌నేమ‌న్నారంటే..

అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత వాడూ రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే విలీనం పరిస్థితి వచ్చినపుడు వాడికి అది నచ్చలేదు. ఆ సమయంలో విబేధించాడు. అంటే అన్నయ్యకు ఎదో ఎదురుతిరిగి మాట్లాడటం కాదు. మౌనంగా ఉండిపోయాడు. తర్వాత కొంత కాలనికి జనసేన స్థాపించాడు. అయితే ఆ సమయంలో నేను అన్నయ్య వైపు నిల్చున్నాను. కల్యాణ్ బాబు ఒక్కడే పోరాటం చేశాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ గెలుపులో కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నా మద్దత్తు వాడికే. నేను వాడికే ఓటు వేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మెగా ఫ్యాన్స్ ను కూడా కళ్యాణ్ బాబుకే సపోర్ట్ చేయాలని సూచిస్తానని చెప్పారు.

కళ్యాణ్ బాబు రాష్ట్రానికి నాయకత్వం వహించడం చారిత్రాత్మక అవసరమన్నారు నాగ‌బాబు! అయితే ప‌వ‌న్ ఫాన్స్‌ను తిట్ట‌డంపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. `అన్నయ్య ఫంక్షన్ లో కళ్యాణ్ పేరుతో అల్లరి చేయడం కళ్యాణ్ బాబుకు కూడా నచ్చదు. ఇలా జరుగుతుందని వాడికి తెలిస్తే ఖచ్చితంగా బాధ పడతాడు. అందుకే అదిశ్రుతి మించడంతో కాస్త గట్టిగా చెప్పాల్సివచ్చింద`ని వివ‌రించాడు. అయితే తాను త‌మ్ముడి వెన‌కాలే ఉంటాన‌ని చెప్ప‌డంతో ఇక అన్న‌య్య చిరంజీవి సినిమాల‌కే ప‌రిమిత‌మా?  లేక రాజ‌కీయ అస్త్ర స‌న్యాసం చేస్తాడ‌ని ముందుగానే అభిమానుల‌కు క్లారిటీ ఇచ్చాడా? అనే సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతుతున్నాయి.

చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share