తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!

సినీ మన్మ‌థుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటిక‌ల్‌గా ఆయ‌న ఓ రేంజ్‌లో గేమ్ ఆడేస్తున్నారు. ఫ‌క్తు రాజ‌కీయ నేత‌ల‌ను సైతం ఆయ‌న మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేష‌కులు. అస‌లేం జ‌రిగిందో చూద్దాం. నాగార్జున‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన వ్యాపారాలు స‌హా ఆయ‌న ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉండ‌గానే అవి ప్రారంభం కావ‌డంతో కొన్ని హైద‌రాబాద్‌, కొన్నింటిని విజ‌య‌వాడ‌, విశాఖ‌ల్లోను ఏర్పాటు చేశారు. అయితే, త‌ర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు కొన్ని తెలంగాణ‌లోనూ, కొన్ని విజ‌య‌వాడ‌లోనూ ఉండిపోయాయి.

ఇక‌, ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. తెలంగాణ‌లో కేసీఆర్ కారు రివ్వున సాగుతుండ‌గా, ఏపీలో చంద్ర‌బాబు సైకిల్ జోరు సాగుతోంది. ఈ క్ర‌మంలో నాగ్ ఏ ఎండ‌కా గొడుగు అన్న‌ట్టు రాజ‌కీయ పార్టీల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. నిజానికి రాజ‌కీయ పార్టీల అండ లేకుండా వ్యాపారాలు న‌డ‌వవు కాబ‌ట్టి ఈ విష‌యం బాగా తెలిసిన నాగ్ తెలంగాణ‌లో కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌య్యారు. తాజాగా కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్న కేసీఆర్‌ను సోమ‌వారం సాయంత్రం ప‌ర్స‌న‌ల్‌గా వెళ్లి మ‌రీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లుసుకుని ప‌రామ‌ర్శించాడు నాగ్‌.

అదేవిధంగా కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్‌తోనూ నాగ్ సంబంధాలు కొన‌సాగిస్తున్నాడు. నాగ్‌కి కాబోయే కోడ‌లు స‌మంత ఏకంగా తెలంగాణ చేనేత అంబాసిడ‌ర్ అన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో కేసీఆర్ బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే నాగార్జునకు చెందిన ఆస్తుల‌పై ఎటాక్ మొద‌లైంది. నాగ్‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్లో అక్ర‌మ క‌ట్టడాలు ఉన్నాయంటూ కూల్చివేత‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గాని ఆ కూల్చివేత‌లు ఆగిపోయాయి. అప్ప‌ట్లోనే ద‌టీజ్ నాగ్ అనే వ్యాఖ్య‌లు తీవ్రంగా వినిపించాయి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఇక్క‌డ చంద్ర‌బాబుతో నాగ్ దోస్తీ చేయడం లేదు. నిజానికి అధికారంలో ఉన్న నేత‌ను ప‌క్క‌న పెట్టి.. విప‌క్ష నేత జ‌గ‌న్‌కు వంత పాడుతున్నారు. దీనికీ కార‌ణం ఉంది. గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు నాగ్‌కి అన్ని విధాలా సాయం చేశార‌ని చెప్పుకొనేవారు. దీంతో ఆయ‌న చెప్పిన‌ట్టు నాగ్ వినేవాడ‌ని, అప్ప‌ట్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు కూడా నాగ్ ఫ్రీగా ప‌బ్లిసిటీ చేశార‌ని టాక్ న‌డిచింది. ఆ బంధ‌మో ఏమో.. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో నాగ్ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాడు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీ సీటును త‌న స‌తీమ‌ణి అమ‌ల‌కు కేటాయించాల‌ని నాగ్ కోరుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఏదేమైనా.. నాగ్ అక్క‌డ అలా వ్యాపారాలు కాపాడుకుంటూ.. ఏపీలో రాజ‌కీయంగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నాడ‌న్న‌మాట‌!! మ‌న్మ‌థుడా మ‌జాకా?!!