న‌ల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అభ్య‌ర్థులు వీళ్లేనా..!

తెలంగాణ రాజ‌కీయాల‌ను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న న‌ల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్ప‌టికే అక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స్పీడ‌ప్ చేసే ప‌నిలో ఉంది.

న‌ల్గొండ ఎంపీ సీటు ప‌రిధిని మొత్తం 46 యూనిట్లుగా విభ‌జించి ఒక్కో యూనిట్‌ను ఒక్కో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేకు అప్ప‌గించ‌నుంది. ఈ ఉప ఎన్నిక కోసం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్క‌డే మ‌కాం వేయ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో నాలుగు ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ నుంచి ఎవ‌రు పోటీలో ఉంటార‌న్న‌దానిపై కూడా అప్పుడే తెలంగాణ రాజ‌కీయవ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి పేరుతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎమ్మెల్సీగా ఓడిపోయిన తేరా చిన్న‌ప‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక కోమ‌టిరెడ్డి బంధువులకు చెందిన ఓ వ్య‌క్తి పేరు కూడా లైన్లో ఉంది. అధికార పార్టీలో ఆశావాహులు ఎక్కువ‌గానే ఉన్నా ప్ర‌ధానంగా ప్ర‌స్తుతానికి ఈ పేర్లే తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఇక టీడీపీ నుంచి ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేరు లైన్లో ఉంది. రేవంత్‌రెడ్డి కూడా త‌న సామ‌ర్థ్యానికి ఇదే స‌రైన ప‌రీక్ష‌గా ఆయ‌న భావిస్తున్నారు. ఇక్క‌డ త‌న‌కు క‌నీసం రెండో ప్లేస్ అయినా ద‌క్కితే ఓకే అని, లేకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను టీడీపీలో ఉండాలా ? లేదా ప్ర‌త్యామ్నాయం చూసుకోవాలా ? అన్న దానిపై కూడా ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్టు స‌మాచారం. అందుకే ఇక్క‌డ పోటీ చేసేందుకు రేవంత్ రెడీగానే ఉన్నార‌ట‌.

ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక‌టేశ్వ‌ర్లు పేరు ఒక్క‌టే ప్ర‌స్తుతానికి లైన్లో ఉంది. పార్టీ ప‌రిశీల‌న‌లో న‌గ‌రానికి చెందిన అంబ‌ర్‌పేట ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి పేరు ఉన్నా ఆయ‌న ఇక్క‌డ పోటీ చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేర‌ట‌. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తున్నా కోమ‌టిరెడ్డి సోద‌రులు మాత్రం తాము ఉత్త‌మ్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌మ‌ని చెపుతున్నారు. దీంతో ఎవ్వ‌రూ పోటీ చేయ‌డానికి ముందుకు రాని ప‌క్షంలో ఉత్త‌మ్ త‌న భార్య అయిన కోదాడ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తిని పోటీ పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏదేమైనా నాలుగు పార్టీల నుంచి న‌ల్గొండ‌లో గ‌ట్టి అభ్య‌ర్థులే బ‌రిలో ఉంటే పోరు అదిరిపోవ‌డం ఖాయం.