నంద్యాల ఉప ఎన్నిక న‌గరా మోగింది

ఏపీతో పాటు తెలంగాణ‌లోను ఉత్కంఠ రేపుతోన్న ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నంద్యాల ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో టీడీపీలోకి జంప్ అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయానికి వైసీపీ తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ పడింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి జంప్ అవ్వ‌డం, చివ‌ర‌కు ఆయ‌నే వైసీపీ అభ్య‌ర్థి అవ్వ‌డం జ‌రిగాయి.

ఇక టీడీపీ కూడా భూమా కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇరు పార్టీలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు కూడా నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే పర్యటించారు. వైఎస్ జగన్ కూడా ఈ నెలాఖరున జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు నంద్యాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా ఉంది..

– జూలై 29 ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

– నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్టు 5

– నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7

– నామినేషన్ల ఉపసంహరణకు గ‌డువు ఆగస్టు 9

– పోలింగ్‌ ఆగస్టు 23

– ఓట్ల లెక్కింపు ఆగ‌స్టు 28

– ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.