టీడీపీకి మ‌రో షాక్‌… వైసీపీ గూటికి కీల‌క నేత

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్క‌డ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రు త‌మ టీంను అంతా ఇక్క‌డ మోహ‌రించారు. టీడీపీ నుంచి ఆరుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేల‌ను బాబు ఇక్క‌డ మోహ‌రిస్తే జ‌గ‌న్ ఏకంగా 14 మంది ఎమ్మెల్యేల‌ను వైసీపీ నుంచి రంగంలోకి దించారు.

ఇక ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు రెండు రోజుల ముందే నంద్యాల‌లో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి త‌న ఫ్యామిలీతో స‌హా వైసీపీలో చేరిపోయారు. ఈ షాక్ నుంచి టీడీపీ తేరుకోక ముందే ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. తాజాగా నంద్యాల కు చెందిన మరోకీలక నేత వైసీపీలో చేరారు. శుక్రవారం నంద్యాలకు చెందిన రాకేశ్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రాకేశ్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే రాకేశ్‌రెడ్డిని మ‌రోసారి పోటీ చేయాల‌ని టీ పీసీసీ కోరింది. ఇందుకు తిర‌స్క‌రించిన రాకేశ్‌రెడ్డి వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు.

రాకేశ్‌రెడ్డితో పాటు ఆయ‌న మ‌ద్ద‌తు దారులు కూడా వైసీపీలో చేరిపోవ‌డంతో ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద ప్ల‌స్‌గా మారింది. ఉప ఎన్నిక హోరాహోరీగా ఉండ‌డంతో ఇక్క‌డ ప్ర‌తి ఓటు కీల‌కంగానే మారింది. దీంతో ఇక్క‌డ కీల‌క నాయ‌కులు అంద‌రూ వ‌రుస‌పెట్టి వైసీపీలో చేర‌డం టీడీపీకి పెద్ద షాక్ లాంటిదే.