టీడీపీకి హ్యాండ్ ఇచ్చి.. జగన్ చెంతకు మాజీ ఎమ్మెల్యే

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉంటుందా ? అని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంది. అక్క‌డ రోజు రోజుకు ప‌రిస్థితులు మారుతున్నాయి. నంద్యాల ఉప నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి.

ఇక్క‌డ టీడీపీ ఏకంగా 6 గురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో పాటు ఏకంగా 10 శాఖ‌ల నుంచి ఇక్క‌డ అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరు చేసి నంద్యాల‌పై ఎక్క‌డా లేని ప్రేమ కురిపించేస్తోంది. టీడీపీ నిన్న‌టి వ‌ర‌కు దూకుడుగానే ముందుకు వెళ్ల‌గా నిన్న ఆ పార్టీకి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ప‌రిస్థితి ఎదురైంది.

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈరోజు వైసీపీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో జీవ‌న్‌రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో కీల‌క‌నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో స‌హా వైసీపీలో చేర‌డంతో టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది.

జీవ‌న్‌రెడ్డి కుమారులు వెంకటరెడ్డి, శివశంకర్ రెడ్డి కూడా పార్టీలో చేరడంతో నంద్యాలలో వైసీపీ బలం మరింత పెరిగిందని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పార్టీ మారిన జీవ‌న్‌రెడ్డి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఉప ఎన్నిక కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సంజీవరెడ్డి ఆరోపించారు.