లోకేష్ ఎఫెక్ట్‌.. టీడీపీకి బిగ్ షాక్‌!

July 14, 2018 at 11:29 am
lokesh-TG Venkatesh

నేత‌లు టికెట్ కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న కీల‌క‌ స‌మ‌యంలో.. పార్టీ ముఖ్యులు ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాలి! పొర‌పాటున చేసే చిన్న ప్ర‌క‌ట‌న అయినా అది పెద్ద ప్ర‌భావం చూపుతుంది. అస‌లుకే ఎస‌రు పెట్టేలా చేస్తుంది. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఎవ‌రికీ అంతు చిక్కడం లేదు. కొంత‌మంది నేత‌లు ఇప్ప‌టికే టికెట్ కోసం అధినేత, సీఎం చంద్రబాబుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. టికెట్ ద‌క్కుతుందో లేదోన‌నే సందేహంలో ఉండ‌గా.. ఆయ‌న చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. టికెట్లు కావాల‌నుకునే వారికి ఆయ‌న త‌న సైడ్ నుంచి మాటిచ్చేయ‌డ‌మేగాక‌.. అభ్య‌ర్థుల‌న కూడా ప్ర‌క‌టించేస్తున్నారు. ఇంకా టికెట్ల‌పై క్లారిటీ రాకుండానే.. క‌ర్నూలు జిల్లాలో ఆయ‌న టికెట్లు ప్ర‌క‌టించ‌డం సీనియ‌ర్లలో గుబులు రేపుతోంది. రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం మ‌న‌స్తాపానికి గురవ‌డం.. ఎవ‌రి బుజ్జ‌గింపుల‌కూ లొంగ‌కపోవ‌డం చ‌ర్చనీయాంశమైంది. 

 

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుకను, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగంగానే పిలుపునివ్వ‌డం క‌ర్నూలులో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. దీనిపై రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్‌.. త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేశారు. ఒక‌ప‌క్క త‌న కొడుక్కి క‌ర్నూలు టికెట్ ఇప్పించాల‌ని ఆయ‌న తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే! ఈ నేప‌థ్యంలో స‌డన్‌గా లోకేష్ ప్ర‌క‌ట‌నతో ఖంగుతిన్నారు. టికెట్లు ప్ర‌క‌టించ‌డానికి లోకేష్ ఎవ‌రంటూ గ‌ట్టిగానే స్పందించారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి కాద‌ని, పార్టీ అధ్య‌క్షుడు కూడా కాదంటూ మండిప‌డ్డారు. అయితే ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. సీఎం చంద్ర‌బాబు మాత్రం ఇంకా స్పందించ‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌రింత మ‌న‌స్తాపానికి గుర‌వుతున్నార‌ట‌. 

 

చంద్ర‌బాబు కూడా త‌న కొడుకు మాటకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఎలాంటి అడుగులు వేస్తార‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎప్పటి నుంచో తాను కర్నూలు అసెంబ్లీ సీటు తన కుమారుడికి కేటాయించాల్సిందిగా కోరుతున్నానని.. తాము పక్కనే ఉండగా లోకేష్ ఇలాంటి ప్రకటన చేస్తే.. ఇప్పుడు తాము లోకేష్ ఎందుకు విలువ ఇవ్వాలని  టీజీ వెంకటేష్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించార‌ట‌. ఇదే అవ‌కాశంగా వైసీపీ నేత‌లు వేగంగా పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న కొడుక్కి టికెట్ ఇస్తామ‌ని హామీ ఇస్తుండ‌టంతో టీజీ కొంత సందిగ్ధంలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది సీనియ‌ర్లు.. వైసీపీ వైపు చూస్తున్నారు. త‌మ‌కు అక్క‌డి నుంచి టికెట్ ఇస్తామ‌ని హామీ ఇస్తుండ‌టంతో ఆ పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. 

 

వైసీపీలో చేరితే టీజీకి ఎంపీ, కొడుక్కి ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగానే జగన్ మాత్రం పార్టీలో చేరితో రాజ్యసభ వదులుకోవాల్సి ఉంటుందని సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వ‌ర‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న పార్టీ మారితే క‌ర్నూలులో టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ పై టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలకు కొంత మంది సీనియర్లు ఫోన్ చేసి.. బాగా మాట్లాడారని అభినందించార‌ట‌. 

లోకేష్ ఎఫెక్ట్‌.. టీడీపీకి బిగ్ షాక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share